తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న ప్రైవేట్ డెయిరీలకు దీటుగా విజయ తెలంగాణ డెయిరీని అభివృద్దిలో ముందుకు తీసుకెళ్ళేలా డెయిరీ, పశుసంవర్ధక, టీఎస్ఎల్డీఏ సంయుక్తంగా కార్యాచరణ ను రూపొందించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాజేంద్రనగర్ లోని కోఆపరేటివ్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్ లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల విజయ డెయిరీ డీడీలు, మేనేజర్ లకు ఇంటిగ్రేటెడ్ డెయిరీ డెవలప్మెంట్ ప్లాన్ పై నిర్వహించిన ఒక రోజు వర్క్ షాప్ ను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ వర్క్ షాప్ లో పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, డైరెక్టర్ రాంచందర్, ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ తంగిరాల, వివిధ జిల్లాలకు చెందిన డీడీలు, బీఎంసీయూ మేనేజర్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ, దేశంలో వ్యవసాయం తర్వాత పాడి పరిశ్రమ రంగం పైనే అత్యధిక కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని వివరించారు. పాడి పరిశ్రమ రంగం అభివృద్ధి కోసం ఈ రంగంపై ఆధారపడి ఉన్న రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అవసరమైన చేయూతను అందిస్తుందని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన విజయ డెయిరీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో ఎంతో అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు.
పాడి రైతుల అభ్యున్నతి కోసం విజయ డెయిరీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ విజయ డెయిరీకి పాలు పొసే రైతులకు ప్రభుత్వం ఉచితంగా వైద్య సేవలు అందించడమే కాకుండా, సబ్సిడీపై పాడి గేదెల పంపిణీ, గడ్డి సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా జీవాల వద్దకే వెళ్ళి వైద్య సేవలు అందించే విధంగా సంచార పశు వైద్యశాలలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇవే కాకుండా మేలుజాతి పశుసంపద ఉత్పత్తి, పాల ఉత్పత్తిని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. విజయ డెయిరీ, పశుసంవర్ధక శాఖ, గోపాల మిత్రలు, టీఎస్ఎల్డీఏ అధికారుల ఆధ్వర్యంలో జీవాల ఆరోగ్య సంరక్షణ, కృత్రిమ గర్భధారణ, ఇతర యాజమాన్య పద్దతులపై అన్ని గ్రామాలలో అవగాహన సదస్సులను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రణాళికాబద్దంగా పని చేస్తే పాల ఉత్పత్తిని పెంచడం సాధ్యమేనని చెప్పారు. విజయ డెయిరీ అధికారులు బీఎంసీయూలు, గ్రామాల వారిగా రైతులతో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి తమ డెయిరీకే పాలు పొసే విధంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ఇదే క్రమంలో గ్రామస్థాయిలో పాల ఉత్పత్తిని పెంచడానికి రైతులు అనుసరించవలసిన విధానాలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. 60 సంవత్సరాల క్రితం లాలాపేటలో విజయ డెయిరీ పరిశ్రమను ఏర్పాటు చేయడం జరిగిందని, నూతన టెక్నాలజీతో మెగా డెయిరీ నిర్మాణం చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. నూతన డెయిరీ అందుబాటులోకి వచ్చే నాటికి విజయ డెయిరీకి 8 లక్షల లీటర్ల కు పాలసేకరణ పెరిగేలా కృషి చేయాలని చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే డెయిరీకి పాలు పోస్తున్న రైతులు కాకుండా నూతన రైతులను ప్రోత్సహించాలని అన్నారు. అదేవిధంగా దళితబంధు క్రింద కూడా ప్రభుత్వం పాడి పశువులను అందజేసిందని, వారిని గుర్తించి విజయ డెయిరీకి పాలు పోసేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. విజయ డెయిరీ ఉత్పత్తులకు విశేషమైన ప్రజాదరణ ఉన్నదని, అన్ని ప్రాంతాల్లో విజయ ఉత్పత్తులు అందుబాటులో ఉండే విధంగా చూడాలని ఆదేశించారు. పోటీ మార్కెట్ లో ప్రైవేట్ డెయిరీలకు ధీటుగా విజయ డెయిరీ అన్ని ఉత్పత్తులపై విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. ఇప్పటికే దేవాదాయ, ఆర్ అండ్ బీ, మున్సిపల్ తదితర శాఖల సహకారంతో విజయ ఉత్పత్తుల నూతన ఔట్ లెట్ లను ప్రముఖ దేవాలయాలు, హైవేల వెంట, పర్యాటక ప్రాంతాలలో ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రానున్న రోజులలో మరిన్ని ఔట్ లెట్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు.
సంస్థ మరింత అభివృద్ధి సాధిస్తే పాడి రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఇందుకోసం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పాడి రైతులకు అవసరమైన సహకారాన్ని అందిస్తూ వారి అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. విజయ ఉత్పత్తులను వినియోగదారులకు మరింత చేరువలో ఉంచేందుకు రాష్ట్రంలో గుర్తించిన 12 ప్రాంతాలలో కోల్డ్ స్టోరేజీ లను ఏర్పాటు చేసి అక్కడి నుండి ఔట్ లెట్ లకు సరఫరా చేసే విధంగా ప్రణాళికలను రూపొందించి, రాబోయే 6 నెలల కాలంలో అమలు పరచాలని ఆదేశించారు. విజయ డెయిరీ సంస్థ అభివృద్ధి కోసం ఇందులో పని చేస్తున్న అన్ని స్థాయిలలోని ఉద్యోగులు అనేక సంవత్సరాలుగా అద్భుతమైన కృషి చేస్తున్నారని, వారి పని నైపుణ్యతను మరింత పెంపొందించేందుకు ఈ వర్క్ షాప్ ఎంతో దోహదపడుతుందని చెప్పారు. ప్రతి మూడు నెలలకోసారి ఇలాంటి వర్క్ షాప్ లను నిర్వహించి మార్కెట్ లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన చేపట్టవలసిన చర్యలపై ప్రణాలికలను రూపొందించి అమలు చేయడం ద్వారా విజయా తెలంగాణ డెయిరీని దేశంలోనే ఉన్నతస్థాయిలో నిలిపేలా కృషి చేయాలని అధికారులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY