ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా నిర్వహించుకొనే రంజాన్ కు అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో జీహెఛ్ఎంసీ, ఎలెక్ట్రికల్, వాటర్ వర్క్స్, హార్టికల్చర్ తదితర శాఖల అధికారులు, సనత్ నగర్ నియోజకవర్గపరిధిలోని మసీదు కమిటీ సభ్యులతో రంజాన్ ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ, రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. గత రెండు సంవత్సరాల నుండి కరోనా మహమ్మారి కారణంగా నిర్వాహించుకోలేకపోయామని అన్నారు. ఈ సంవత్సరం రంజాన్ ఒక్క పొద్దులు (రోజా) ఏప్రిల్ 2 లేదా 3 వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయని, కేవలం 4, 5 రోజుల వ్యవధి మాత్రమే ఉన్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఏర్పాట్లు చేయాలని అన్నారు.
నెల రోజుల పాటు జరిగే ఒక్క పొద్దుల సందర్బంగా ముస్లిం సోదరులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మసీదు కమిటీ సభ్యుల నుండి వచ్చే ఫిర్యాదులపై సకాలంలో స్పందించి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. మసీదుల పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, చెత్త, తదితర వ్యర్ధాలను ప్రతిరోజు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని శానిటేషన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మసీదులలో నెల రోజుల పాటు ఇప్తార్ విందుల నిర్వహణ ఉంటున్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. అదేవిధంగా మసీదులకు వెళ్ళే అన్ని రహదారులకు అవసరమైన ప్రాంతాలలో మరమ్మతులు యుద్దప్రాతిపదికన చేపట్టాలని జీహెఛ్ఎంసీ అధికారులను ఆదేశించారు. మసీదుల పరిసరాలలో ఎక్కడా సీవరేజ్ లీకేజీలు లేకుండా ఇప్పటినుండే అవసరమైన చర్యలు తీసుకోవాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. మసీదులకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా చూడాలని, అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ ల ద్వారా నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
విద్యుత్ అధికారులు అన్ని మసీదుల వద్ద పర్యటించి లైట్ లు అన్ని వెలుగుతున్నాయా లేదా పరిశీలించి అవసరమైన చోట్ల లైట్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. ప్రధాన మసీదుల వద్ద ఎలోజెన్ లైట్ లను ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. పలు మసీదు కమిటీల సభ్యులు వివిధ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. పలు మసీదులలో ఉన్న సమస్యలను పలువురు కమిటీ సభ్యులు తెలపగా, మసీదులలో చేపట్టవలసిన వివిధ అభివృద్ధి పనులపై రంజాన్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ