ఆగస్టు 31 నుండి సెప్టెంబరు 9 వ తేదీ వరకు నిర్వహించే గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బుధవారం ఖైరతాబాద్ వినాయక మండపం వద్ద వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలు పండుగలు, వేడుకలను ఘనంగా జరుపుకోవాలనేది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆలోచన అని పేర్కొన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని పండుగలను నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తులు, నిర్వహకులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఖైరతాబాద్ వినాయకుడు అంటే తెలియని వారు ఉండరని, ఎంతో ప్రసిద్ధి చెందిన ఇక్కడ ప్రతిష్టించే గణనాధుడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి లక్షలాది మంది వస్తారని అన్నారు. దానిని దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన భారీకేడ్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని మంత్రి తలసాని చెప్పారు. ఉత్సవాలు ముగిసే వరకు వాహనాల రాకపోకలను నిలిపివేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా జనరేటర్ లను అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. తాత్కాలిక టాయిలెట్స్ లను కూడా అందుబాటులో ఏర్పాటు చేయాలని జీహెఛ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ఈ పరిసర ప్రాంత ప్రజల ఇబ్బందుల దృష్ట్యా మండపం వెనుక రోడ్డులో వారం రోజులలో నూతన రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. హైదరాబాద్ లో నిర్వహించే గణేష్ ఉత్సవాలు, గణేష్ నిమజ్జనం వేడుకలకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ సంవత్సరం జీహెఛ్ఎంసీ, హెఛ్ఎండీఏ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ల ఆధ్వర్యంలో 6 లక్షల మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శాంతిభద్రతల నిర్వహణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా ఉందని అన్నారు. మినీ ఇండియాగా పిలవబడే హైదరాబాద్ నగరంలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు చాలా బాధాకరం అని పేర్కొన్నారు. ప్రజలు కూడా ఆవేశాలకు లోనుకాకుండా సంయమనంతో ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న, జోనల్ కమిషనర్ రవి కిరణ్, డీసీ మోహన్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారి డాక్టర్ వెంకట్, వాటర్ వర్క్స్ ఈఎన్సీ కృష్ణ, ఆర్ అండ్ బీ ఈఈ రవీంద్ర మోహన్, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు సుదర్శన్, తదితరులు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY