
తెలంగాణలో ఎన్నికల సమరం రోజురోజుకూ ముదురుతోంది. అభ్యర్థులు తమ గెలుపు కోసం విపరీతంగా శ్రమిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంపీలు ఎక్కువగా పోటీ చేస్తున్నారు. తెలంగాణలో ఉన్న 17 మంది లోక్‌సభ సభ్యుల్లో.. ఏడుగురు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్రంలో ముగ్గురు ఎంపీలు ఉండగా.. ప్రతి ఒక్కరూ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీకి దిగారు. ఇక భారతీయ జనతా పార్టీలో కిషన్ రెడ్డి మినహా.. ముగ్గురూ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. బీఆర్‌ఎస్ నుంచి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.. దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు.
నల్లగొండ ఎంపీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. హుజూర్‌నగర్ నుంచి, ఆయన సతీమణి పద్మావతిరెడ్డి.. కోదాడ నుంచి పోటీ చేస్తున్నారు. రెండు నియోజకవర్గాల్లో భార్యాభర్తలు పోటీ చేస్తుండటంతో.. ఉత్తమ్ ఆ రెండు సెగ్మెంట్లకే పరిమితమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తిరిగి నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. తన పార్లమెంటు పరిధిలోనే కాకుండా రాష్ట్రంలోని ఇతర అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే నకిరేకల్ అభ్యర్థి వేముల వీరేశానికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంటు నుంచి పోటీ చేస్తున్నారు. శ్రేణుల్లో సంజయ్‌కు ఉన్న క్రేజ్‌ను వినియోగించుకోవాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించడంతో.. రాష్ట్రవ్యాప్తంగా పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయన ప్రచారం చేయనున్నారు. ఇందుకు ఆయన హెలికాప్టర్ కూడా వినియోగించనున్నారు. అలాగే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.. కోరుట్ల నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన కోరుట్లలో ప్రచారానికే పరిమితమవుతున్నారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు.. బోథ్ అసెంబ్లీ సెగ్మెంటు నుంచి పోటీ చేస్తున్నారు.
కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నుంచి ఎమ్మెల్యే స్తానానికి పోటీ చేస్తున్నారు. ఇటీవల నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లిన ప్రభాకర్‌రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతలుగా ఉన్న ముగ్గురు పార్లమెంటు సభ్యులూ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. మల్కాజ్‌గిరి ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరోసారి కొడంగల్ నుంచి పోటీ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నుంచి కూడా రేవంత్ బరిలోకి దిగుతున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌కు అన్నీతానై వ్యవహరిస్తున్నారు. బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యే ఎన్నికల్లో నిలబడాలని పార్టీ ఆదేశం కాగా.. కాంగ్రెస్‌లో పోటీపడి మరీ అందరూ ఎమ్మెల్యే బరిలోకి దిగారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE