తెలంగాణ హస్తగతమైంది. పదేళ్ల గులాబీ పార్టీ ఆధిపత్యానికి బ్రేక్ పడింది. భారత రాష్ట్ర సమితి హోరాహోరీగా పోరాడినప్పటికీ విజయానికి దూరమైంది. మొదటి నుంచీ పేర్కొంటున్నట్లుగా కాంగ్రెస్ గాలిలో కారు ఎగిరిపోయింది. అయితే.. ఈ ఎన్నికల్లో మంత్రులు, పలువురు ప్రముఖులు సైతం ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటింగ్ శాతం పెంచుకున్నప్పటికీ.. సింగిల్ డిజిట్ దాటలేక పోయింది. ఆ సంగతి అలా ఉంచితే.. ప్రస్తుతంగా ఎంపీలుగా ఉండి.. అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన నేతలందరూ ఓటమి చెందడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంటు నుంచి పోటీ చేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.. కోరుట్ల నియోజకవర్గం నుంచి, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు.. బోథ్ అసెంబ్లీ సెగ్మెంటు నుంచి పోటీ చేశారు. ముగ్గురూ ఈ ఎన్నికల్లో ఓటమి చెందారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ చేతిలో బండి ఓటమి పాలయ్యారు. బండి పై గంగుల 10,141 ఒట్ల మెజారిటీతో భారీ విజయాన్ని నమోదు చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటమి చవిచూసిన బండి ఈసారి కూడా ఓడిపోవడం గమనార్హం. తెలంగాణలో బీజేపీ బలపడడంలో కీలక పాత్ర పోషించిన బండి సంజయ్.. మొదటి నుంచి కూడా తన గెలుపుపై అనుమానంగానే ఉన్నారు. మొదట ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినప్పటికీ అధిష్టానం ఒత్తిడి మేరకు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి మరోసారి ఘోర ఓటమి చవిచూశారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్లలో.. బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ చేతిలో 10వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు.. బోథ్ నుంచి పోటీ చేయగా బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ చేతిలో 22 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో… రాష్ట్రంలో ఎనిమిది సీట్లు గెలవటం పట్ల ఆనందించాలో.. లేక ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు, అందులో ఇద్దరు కీలక నేతలు ఓడిపోయారని బాధపడాలో అర్థం కాని పరిస్థితిలో బీజేపీ శ్రేణులు ఉన్నారు. మరి పరిణామంతో తెలంగాణలో బీజేపీ గెలిచినట్టా.. ఓడినట్టా.. అని రాష్ట్ర నాయకత్వం ఆత్మపరిశీలన చేసుకుంటోంది.
మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీలు ఈ ఎన్నికల్లో గెలుపొందటం విశేషం. నల్లొండ నియోజకవర్గం నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, హుజూరాబాద్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేయగా.. భారీ మెజార్టీలతో గెలుపొందారు. అయితే.. ఈ ముగ్గురూ కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో అవే స్థానాల నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థుల చేతిలో ఓడిపోగా.. మళ్లీ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీలుగా గెలుపొందారు. కాగా.. ఇప్పుడు మళ్లీ అదే స్థానాల నుంచి బరిలోకి దిగి సత్తా చాటటం విశేషం. ఓవైపు.. కాంగ్రెస్ ఎంపీల్లో ముగ్గరు గెలుపొందటం.. మరోవైపు బీజేపీ ఎంపీలు ముగ్గురూ ఓడిపోవటంతో పాటు మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నుంచి భారీ మెజార్టీ నుంచి గెలుపొందటం.. ఓటర్లు ఇచ్చిన విలక్షణ తీర్పుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE