నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో రేపు (నవంబర్ 3, గురువారం) జరగనున్న ఉప ఎన్నిక పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. పోలింగ్ కు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎన్నికల మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ సిబ్బంది పోలింగ్ సామాగ్రితో బుధవారం సాయంత్రానికే తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ గురువారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మునుగోడు నియోజకవర్గం పరిధిలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 50 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. మరోవైపు మునుగోడులో 5,686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నప్పటికీ, కేవలం 739 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.
పోలింగ్ ప్రక్రియలో భాగంగా మొత్తం 298 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇందులో 45 ప్రాంతాల్లోని 105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, ఆయా చోట్ల పోలీసులు, కేంద్ర బలగాలతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తునట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. అలాగే ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ముగ్గురు ఆఫీసర్లు ఉంటారని, ఈ ఎన్నికకు మొత్తం 1,192 మంది సిబ్బందిని నియమించామని, మరో 300 మంది సిబ్బంది కూడా అదనంగా విధుల్లో పాల్గొననున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఉప ఎన్నికను పూర్తిస్థాయి కోవిడ్ నిబంధనల ప్రకారం నిర్వహించనున్నట్టు తెలిపారు.
ముందుగా ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి బరిలో నిలిచారు. మూడు పార్టీల కీలక నేతలు కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో ఈ ఉపఎన్నికపై ప్రజల్లో ప్రత్యేక ఆసక్తి నెలకుంది. ఈ నేపథ్యంలో రేపు పోలింగ్ ప్రక్రియ నిర్వహించి, నవంబర్ 6వ తేదీన నల్గొండలో ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE