
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో.. అందరి చూపు సెటిలర్లు ఎక్కువగా ఉండే కూకట్ పల్లి, శేరిలింగంపల్లి వైపే పడింది. ఇప్పుడే కాదు శాసన సభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఈ రెండు నియోజకవర్గాలపై నేతలు ప్రత్యేక దృష్టి సారిస్తారు. పైరవీలు, కాళ్ల బేరాలు, సయోధ్యలు కుదుర్చుకుంటూ రాత్రికి రాత్రే పొలిటికల్ లెక్కలు మార్చుతూ.. ఈ రెండు నియోజకవర్గాలను చేజిక్కించుకోవడానికి రెడీ అయిపోతారు. తాజాగా బీజేపీ, జనసేన పొత్తులతో ఇప్పుడు కూకట్ పల్లి నియోజకవర్గం కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్టుపట్టుకుని కూర్చోవడంతో..చివరకు బీజేపీ ఓ మెట్టు దిగింది.
దీంతో ముందు నుంచి జనసేనాని అడుగుతున్న కూకట్‌పల్లి నియోజవర్గాన్ని జనసేన నిలుపుకొన్నట్లు అయింది. కూకట్ పల్లి నుంచి అభ్యర్ధిగా రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ను జనసేన బరిలోకి దింపింది. అయితే ఒక రోజు ముందే ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ జనసేన పార్టీలో చేరి టిక్కెట్ దక్కించుకోవడమే హాట్ టాపిక్ అయింది. బీజేపీ నుంచి వచ్చిన ఆయన.. సోమవారం జనసేన పార్టీలోకి చేరిన ఆయనకు.. మంగళవారం టికెట్ ఖరారవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కరోజులోనే ముమ్మారెడ్డి ఫేటు మారిపోవడం.. కూకట్ పల్లి అభ్యర్థిగా నిలబడటం ఎలా జరిగాయంటూ చర్చలు షురూ చేశారు. అయితే ముందుగానే జనసేన సీట్ల కేటాయింపుపై ఆయనకు లీకులు వినిపించాయా, లేక గెస్ చేశారా అన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు ముందుగానే అభ్యర్థిగా తన పేరు ఖరారు చేసుకునే ముమ్మారెడ్డి పార్టీ మారారేమోనని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. పొలిటికల్ లెక్కలు ఇలాగే ఉంటాయంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
కూకట్ పల్లి అభ్యర్థిగా నిలబడుతున్న ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ వయసు 57 ఏళ్లు. ఆయన ఎంకామ్, ఎంబీఏ చదివారు. ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ భార్య పేరు విజయలక్ష్మి కాగా వీరికి డాక్టర్ తేజశ్రీ,హేమశ్రీ అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవిలో ముమ్మారెడ్డి కొనసాగుతున్నారు. ఇక ఆయన పొలిటికల్ కెరీర్ కనుక చూస్తే.. ముమ్మారెడ్డి ముందుగా టీడీపీలో చేరి.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ సమయంలో నందమూరి సుహాసినికి టీడీపీ టికెట్ ఇవ్వడంతో..సుహాసినికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ ఏడాది ఆగస్టులో ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ బీజేపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీలో చురుగ్గా పని చేస్తూ కూకట్‌పల్లి టికెట్ రేసులో నిలిచారు. ఈసారి అయినా బీజేపీ నుంచి టికెట్ తనకే వస్తుందని ముమ్మారెడ్డి చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ పొత్తులో భాగంగా బీజేపీ ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించింది. అయితే ఈ విషయాన్ని ఒక్కరోజు ముందే అంచనా వేసిన ముమ్మారెడ్డి .. చాకచక్యంగా జనసేన పార్టీలో చేరి టికెట్ సంపాదించారంటూ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మొత్తంగా.. తాను అనుకున్నట్లే టికెట్ సాధించి కూకట్‌పల్లి నుంచి బరిలో నిలబడుతున్నారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికార బీఆర్ఎస్ తరపున పోటీలో ఉండగా..కాంగ్రెస్ నుంచి బండి రమేశ్ పోటీ చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE