కొనసాగుతున్న నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్

Polling for Nizamabad Local Body MLC Elections Begins, will End at 5PM

నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఈ రోజు ఉదయం 9 గంటలకు పోలింగ్ మొదలవగా, సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పోలింగ్ కోసం అధికారులు ముందుగానే అన్ని జాగ్రత్తలతో ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 50 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమీప పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. బాన్సువాడలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే నిజామాబాద్ లో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, బిగాల గణేష్ గుప్తా ఓటు వేశారు. మరోవైపు ఎమ్మెల్సీ ‌ఉప‌ ఎన్నిక సందర్భంగా, టిఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత కామారెడ్డి, బోధన్‌ లలో పోలింగ్ కేంద్రాల్లో పర్యటించి, పోలింగ్ సరళిని పరిశీలించారు.

ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో టిఆర్‌ఎస్‌ పార్టీ తరపున నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్‌ పార్టీ తరపున సుభాష్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా లక్ష్మీ నారాయణ పోతంకర్ పోటీలో ఉన్నారు. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మెజార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులంతా టిఆర్ఎస్ పార్టీ సభ్యులే కావడంతో కల్వకుంట్ల కవిత గెలుపు ఖాయం కానుంది. ఈ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు పక్రియను అక్టోబర్‌ 12 వ తేదీన చేపట్టనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu