తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ దూకుడుగా ముందుకెళ్తోంది. ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన హయాంలో ప్రజాదర్బార్ నిర్వహించేవారు. ఆ తర్వాత దాదాపు పదేళ్ల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. పోయిన వారం నిర్వహించిన ప్రజాదర్బార్‌కు విశేష స్పందన లభించింది. తమ సమస్యలు సీఎంతో చెప్పుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. మొదటి రోజు దాదాపు నాలుగు వేలకు పైగా అర్జీలు ముఖ్యమంత్రికి అందాయి.
ఈక్రమంలో ప్రజాదర్బార్‌కు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజాదర్బార్ పేరును ప్రజావాణిగా మార్చేశారు. ఇక నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రజావాణి పేరుతో పిలవాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంతేకాకుండా మొదట్లో ఈ కార్యక్రమాన్ని వారానికి ఒక్కరోజు.. శుక్రవారం మాత్రమే నిర్వహించాలని అనుకున్నారు. కానీ ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండడంతో.. వారానికి రెండు రోజుల పాటు ప్రజావాణిని నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
ఇక నుంచి ప్రతీ మంగళవారం, శుక్రవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇకపై జ్యోతిబాపూలె ప్రజాభవన్‌లో మంగళ, శుక్రవారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నారు. ఇందుకోసం అధికారులు మరింత కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎంకు అర్జీలను అందజేసేందుకు ముందుగా దివ్యాంగులు, వికలాంగులతో పాటు ఉదయం 10 గంటల లోపు వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
ఇకపోతే సీఎంకు అర్జీలను అందజేసేందుకు ఉదయం 7 గంటల నుంచే ప్రజలు ప్రజాభవన్ ఎదుట బారులు తీరుతున్నారు. వారికి తాగునీటితో పాటు ఇతర సౌకర్యాలను సిబ్బంది కల్పిస్తున్నారు. అయితే ఇక సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారికి ఉదయం పూట టిఫిన్ కూడా అందించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE