పోరుగ‌డ్డ నుంచి రేవంత్ మ‌రో పోరు..

CM Revanth reddy, Congress, Indravelli sabha, Lok sabha elections, kcr, priyanka gandhi, Revanth Reddy News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party,Telangana Politics, ango News Telugu, Mango News
CM Revanth reddy, Congress, Indravelli sabha, Lok sabha elections

ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన నాటి నుంచీ పాల‌న‌లో బిజీ అయిన రేవంత్ రెడ్డి.. పార్టీ.. లోక్ స‌భ ఎన్నిక‌లపై అంత‌గా దృష్టి కేంద్రీక‌రించ‌లేదు. శ్రేణులను స‌మావేశ ప‌ర‌చి గెలుపుపై సూచ‌న‌లు.., తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు త‌ప్పా.. త‌న‌దైన శైలిలో ప్ర‌చారం ఇంకా ప్రారంభించ‌లేదు. బీఆర్ ఎస్ నుంచి కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, బీజేపీ నుంచి కిష‌న్ రెడ్డి లోక్ స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ముందుగానే మొద‌లెట్టారు. అయితే.. వారికి భిన్నంగా రేవంత్ రెడ్డి తొలిసారిగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఒక విధంగా ప‌రిశీలిస్తే.. పోరు గడ్డ గా పేరుగాంచిన ఆదిలాబాద్ నుంచి రేవంత్ మ‌రో పోరు ప్రారంభించిన‌ట్లుగా క‌నిపిస్తోంది. సంక్షేమ ప‌రంగానే కాకుండా.. రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌పైనా ప‌దునైన బాణాలు సంధించారు. ఏ హామీల వ‌ల్ల అయితే అధికారంలోకి వ‌చ్చారో.. వాటి గురించి చెప్ప‌డ‌మే కాకుండా.., ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ ఏ అంశాల‌ను ప‌దే ప‌దే ప్ర‌చారం చేస్తోందో వాటికి స‌రైన బ‌దులిచ్చి కాంగ్రెస్ నేత‌ల్లో ఉత్సాహాన్ని పెంచారు.

అంతేకాకుండా.. ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేలా వ్యూహాత్మ‌కంగా ఆయ‌న స‌భ‌ను ప్లాన్ చేసుకున్నారు. బహిరంగ సభకు ముందు స్వయం సహాయక సంఘాల ఆత్మీయంగా స‌మావేశ‌మై స్వయం సహాయక సంఘాలకు రూ.60కోట్ల విలువైన బ్యాంకు లింకేజీ చెక్కులను పంపిణీ చేశారు. స్వయం సహాయక సంఘాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు అండగా నిలిచేందుకే ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింద‌ని విష‌యాన్ని గుర్తు చేశారు. త్వరలోనే ప్రియాంక గాంధీని పిలిచి రూ.500 లకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తామ‌ని, ఇందిరమ్మ రాజ్యంలో ఆడ బిడ్డలు ఆత్మ గౌరవంతో బ్రతకాలనేదే మా ఆకాంక్ష అని తెలిపారు. అంతేకాకుండా త్వరలోనే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామ‌ని వెల్ల‌డించారు. స్కూళ్లు, హాస్టళ్ల విద్యార్థుల యూనిఫామ్ కుట్టుపని స్వయం సహాయక సంఘాలకే ఇచ్చేలా నిర్ణయం తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేస్తున్నార‌న్న ప్ర‌చారం నేపథ్యంలో స‌భా వేదిక పైనుంచి రేవంత్ తీవ్ర‌మైన స్తాయిలో విరుచుకుప‌డ్డారు. అలాంటి ప్ర‌య‌త్నాల‌ను రాష్ట్ర ప్రజలు ఊరుకోరని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విపక్షాలను హెచ్చరించారు. అలాంటి ఆలోచన చేసిన వాళ్లను వేప చెట్లకు కట్టేసి, కొట్టి లాగుల్లో తొండలు వదలాలని యువతకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలుస్తామని, మరో ఆర్నెల్లలో కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతాడని కొంతమంది నేతలు ప్రగల్బాలు పలుకుతున్నారని ప్రస్తావిస్తూ, ‘‘ఎవడ్రా ప్రభుత్వాన్ని పడగొట్టేది? ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం.. ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం.. ప్రజల కోసం పని చేస్తున్న ప్రభుత్వం… ప్రభుత్వాన్ని పడగొడితే యువత చూస్తూ ఊరుకుంటారా?’’ అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇంద్రవెల్లి అమర వీరుల స్థూపం సాక్షిగా ఆదిలాబాద్‌ జిల్లాను దత్తత తీసుకుంటామని ప్రకటించారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారమే ఇంద్రవెల్లి గడ్డ నుంచే అభివృద్ధికి శ్రీకారం చుట్టామని తెలిపారు.

మొత్తంగా ఈ స‌భ తీరును ప‌రిశీలిస్తే.. కొద్ది రోజులుగా విప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌లు, వ్యాఖ్య‌లను రేవంత్ సీరియ‌స్‌గానే ప‌రిగ‌ణిస్తున్నార‌న్న విష‌యం అర్థం అవుతోంది. కేసీఆర్‌ పదేళ్లలో చేయ‌లేనిది.. రెండు నెల‌ల్లోనే అయిపోతాయా అని ప్ర‌జ‌ల‌కు చాటి చెబుతూనే.. 15 రోజుల్లో 15వేల కానిస్టేబుల్‌ ఉద్యోగాలు భర్తీ.. మ‌రో రెండు గ్యారెంటీల అమ‌లు ప్ర‌క‌ట‌న‌ల ద్వారా మ‌హిళ‌ల‌ను, యువ‌త‌ను ఆక‌ట్టుకున్నారు. గ‌త ప్ర‌భుత్వంలో జ‌రిగిన అవినీతిని కూడా ఈ స‌భ ద్వారా మ‌రోసారి ప్ర‌స్తావించారు. మిషన్ భగీరథ పేరుతో రూ. 40 వేల కోట్లు దోచుకున్నారని, 7 లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా మార్చారని ప్రస్తుత ఆర్థిక ప‌రిస్థితిని తెలియ‌జేసే ప్ర‌య‌త్నం చేశారు. ప్రజలు కవితను ఓడించినా ఎమ్మెల్సీతో ఉద్యోగం ఇచ్చారంటూ విమ‌ర్శించారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో నిర్వ‌హించిన ఈ స‌భ ద్వారా రేవంత్ మ‌రోసారి కేసీఆర్ టార్గెట్‌గా పోరు ప్రారంభిన‌ట్లు స్ప‌ష్ట‌మైంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE