మాజీ మంత్రి మల్లా రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డికి టార్గెట్ అయ్యారా?.. ఇక నుంచి మల్లా రెడ్డికి కష్టాలు తప్పవా?.. మల్లా రెడ్డి జైలుకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదా?.. అంటే పరిస్థితులు అవుననే సమాధానమిస్తున్నాయి. మల్లారెడ్డి, రేవంత్ రెడ్డి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారయినప్పటికీ.. ముందు నుంచి కూడా వారిద్దరి మధ్య సత్సంభందాలు లేవు. వారిద్దరికి అస్సలు పొసగదు. ఎప్పుడుచూసినా మల్లారెడ్డి, రేవంత్ రెడ్డి ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకునేవారు.
గతంలో మల్లారెడ్డి కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా ఉంటే.. రేవంత్ రెడ్డి విపక్ష ఎంపీగా ఉండేవారు. ఆ సమయంలో మల్లారెడ్డి భూకబ్జాలపై రేవంత్ రెడ్డి పెద్ద యుద్ధమే చేశారు. మల్లారెడ్డి భూకబ్జాలను ఆధారాలతో సహా నిరూపిస్తానని గతంలో సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. కాలం మారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే.. మల్లారెడ్డి మాజీ మంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి చేతిలో పవర్ ఉండడంతో.. మల్లారెడ్డికి తిప్పలు తప్పవనే వాదన వినిపిస్తోంది.
గతంలో భూకబ్జాలకు సంబంధించి మల్లారెడ్డిపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. కానీ అప్పట్లో ఆయన అధికార పార్టీలో ఉండడంతో.. ఏ ఒక్క కేసు కూడా విచారణ వరకు వెళ్లలేదు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి పట్టుమని పది రోజులు కూడా కాకముందే మల్లారెడ్డిపై భూకబ్జా కేసు నమోదు అయింది. మేడ్చల్ జిల్లా కేశవరంలో గిరిజనులకు చెందిన 47 ఎకరాల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారని భిక్షపతి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు మల్లారెడ్డిపై కేసు నమోదు చేసి విచారణ కూడా మొదలు పెట్టారు.
అయితే ఇది మల్లారెడ్డికి ట్రైలర్ మాత్రమేనని.. ముందు మరిన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. గతంలో రేవంత్ రెడ్డి సవాల్ విసిరినట్లుగానే.. మల్లారెడ్డి భూకబ్జాలను ఆధారాలతో సహా నిరూపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇప్పటికే మల్లారెడ్డిపై వచ్చే ఆరోపణలపై ఓ కన్నేసి ఉంచాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ముందు ముందు మాజీ మంత్రి మల్లారెడ్డికి కష్టాలు తప్పవనే వాదన వినిపిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ