కొద్దిరోజులుగా గౌతమ్ అదానీ వ్యవహారం దేశ రాజకీయాలను షేక్ చేస్తోంది. ఇటీవల అదానీ గ్రూప్..తెలంగాణలోని స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి వంద కోట్లు రూపాయల విరాళాన్ని ఇచ్చింది. ఇది బీఆర్ఎస్ నేతలకు ఆయుధంగా మారడంతో.. రేవంత్ రెడ్డి విరాళంగా తీసుకున్న వంద కోట్ల రూపాయల వ్యవహారాన్ని పదేపదే టార్గెగ్ చేయడం మొదలుపెట్టారు.
అదానీ వ్యవహారం తెరపైకి రావడంతో..ఆ మర్నాడు రాహుల్ గాంధీ ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. అదాని వ్యవహారంలో ఎవరి పాత్ర ఉన్న సరే జైలుకు వెళ్లాల్సిందేనంటూ.. శిక్ష అనుభవించాల్సిందేనంటూ చెప్పుకొచ్చారు. అయితే అప్పుడు రాహుల్ మాట్లాడిన ఆ వీడియోను బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేయడం మొదలుపెట్టారు. కేటీఆర్, హరీష్ రావు వంటి వారు ఒక అడుగు ముందుకు వేసి..అదాని వ్యవహారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా పాత్ర ఉందంటూ ఘాటు విమర్శలకు దిగారు.
చివరకు దీనిపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా..రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానీ దగ్గర వంద కోట్లు విరాళం తీసుకున్నారని.. మరి దాని సంగతేంటని ప్రశ్నించింది. దావోస్ ప్రాంతంలో 12,000 కోట్లతో పెట్టుబడులు కుదుర్చుకున్నారని.., మరి వాటిపై ఏం మాట్లాడతారని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించింది. బీఆర్ఎస్, బీజేపీల విమర్శలకు చెక్ పెట్టడానికి రేవంత్ రెడ్డి ఎట్టకేలకు మౌనాన్ని వీడారు.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద.. స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి అదాని గ్రూప్ 100 కోట్లు రూపాయల విరాళం ఇచ్చింది. ఈ చెక్కును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇటీవల గౌతమ్ అదాని అందించారు. అయితే దానిని తిరిగి ఇచ్చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి తాజాగా ప్రకటించారు.
తమ ప్రభుత్వం నిర్మిస్తున్న స్కిల్ యూనివర్సిటీకి అదాని గ్రూపు 100 కోట్లు రూపాయల డొనేషన్ ఇచ్చిందని రేవంత్ గుర్తు చేశారు. దీనిని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తుండటంతో ఆ డబ్బును తాము తీసుకోవడం లేదని దానిని తిరస్కరిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వాన్ని అనవసరమైన వివాదాల్లోకి లాగొద్దని.. 100 కోట్లు ప్రభుత్వ ఖాతాకు బదిలీ చేయవద్దని అదాని గ్రూపు సంస్థలకు తాము లేఖ రాస్తామని.. ఎట్టి పరిస్థితుల్లో తమ ప్రభుత్వం ఆ 100 కోట్లను తీసుకోదని చెప్పారు.
ప్రజల సంక్షేమమే పరమావధిగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. దీనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనక్కి తగ్గదన్నారు. ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయని, అలా ఎందుకు చేస్తున్నాయో ఒకసారి అవి ఆత్మ విమర్శ చేసుకోవాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఎలా ఉందో.. ఇప్పుడు తెలంగాణ ఎలా ఉందో ఒకసారి గమనించాలంటూ రేవంత్ రెడ్డి చురకలు అంటించారు.
అయితే ఇప్పుడు ఇది 100 కోట్లతోనే ఆగిపోతుందా.. లేకపోతే.. దావోస్ లో ఇటీవల కుదుర్చుకున్న పెట్టుబడులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వద్దనుకుంటుందా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ఆ పెట్టుబడులు కూడా తెలంగాణ ప్రభుత్వం వద్దనుకుంటే.. ఇక్కడ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు దాదాపు ముక్కుతాడు పడినట్లు అవుతుంది.