మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో రేవంత్ రాజ‌కీయ వ్యూహం

Revanth, Revanth's political Strategy, Cabinet Expansion, Revanth's political Strategy in Cabinet Expansion, CM Revanth reddy, Telangana CM, Revanth cabinet, Kodandaram, Lok Sabha seats, Congress government, TPCC, Revanth Reddy News And Live Updates, YSRTP, Mango News Telugu, Mango News
CM Revanth reddy, Telangana CM, Revanth cabinet, Kodandaram

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ద్విముఖ వ్యూహం అనుస‌రిస్తున్నారు. అటు పాల‌న‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తూనే.. మ‌రోవైపు విప‌క్షాల‌ను ఎదుర్కొనేలా స‌న్న‌ద్ధం అవుతున్నారు. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లోనూ ఇదే వ్యూహం అనుస‌రిస్తున్నారు. అటువంటి వ్య‌క్తుల‌కే చాన్స్ ఇవ్వాల‌ని భావిస్తున్నారు. కుర్చీ విరిగినా.. బీఆర్ ఎస్ కుతంత్రాలు మాన‌డం లేద‌ని స‌న్నిహితుల వ‌ద్ద  పేర్కొంటున్న రేవంత్‌.. వాటి అడ్డుక‌ట్ట‌కు స‌మాలోచ‌న‌లు చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌ను, ఉద్య‌మ‌కారుల‌ను, నిరుద్యోగుల‌ను ఆక‌ట్టుకునేలా పాల‌న సాగించేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రొఫెస‌ర్ కోదండ‌రాంకు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని భావిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఉద్య‌మ ర‌థ‌సార‌థిగా, టీజేఏసీ చైర్మన్‌గా తెలంగాణ ఉద్యమంలో కీల‌క‌పాత్ర పోషించిన కోదండరాం లాంటి వ్య‌క్తుల‌ను దూరం పెట్ట‌డం కూడా బీఆర్‌ఎస్ అధికారం కోల్పోవ‌డానికి ఓ కార‌ణం. దీన్ని గుర్తించిన రేవంత్ శ‌త్రువు బ‌ల‌హీన‌త‌లను బ‌లంగా మార్చుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే కేసీఆర్‌ దూరం పెట్టిన కోదండ‌రాం మ‌ద్ద‌తును ఎన్నిక‌ల‌కు ముందే పొందారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీని చేస్తానంటూ అప్పట్లో హామీనిచ్చారు. హామీ నెర‌వేర్చారు. అయితే కేసీఆర్‌ దూరం పెట్టినా.. కాంగ్రెస్‌ అక్కున చేర్చుకుని ఆయనును ఎమ్మెల్సీని చేస్తుండటంతో తెలంగాణ ఉద్యమకారులు, సానుభూతిపరుల్లో ఒక సానుకూల వాతావరణం ఏర్పడింది. లోక్‌సభ ఎన్నికల ముంగిట ఈ సానుకూలతను మరింత సుస్థిరం చేసుకుని ఓటు బ్యాంకుగా మలుచుకునే వ్యూహంలో భాగంగానే ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకునే యోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ వాదాన్ని బీఆర్‌ఎస్‌ మళ్లీ తెరపైకి తెచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యమ నేత కోదండరాంను మంత్రివర్గంలో తీసుకుని బీఆర్‌ఎస్‌ ‘తెలంగాణ’ అస్త్రానికి చెక్‌ పెట్టాలన్న ఆలోచనలో రేవంత్‌ ఉన్నారు.

ప్రస్తుతం సీఎం సహా క్యాబినెట్‌లో 12 మంది ఉన్నారు. మరో ఆరుగురికి విస్తరణలో చాన్స్ ద‌క్కే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. వారు కూడా అటు పాల‌న‌ను, ఇటు రాజ‌కీయాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనేవాళ్లు కావాల‌ని రేవంత్ భావిస్తున్నారు. త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ చేప‌ట్టే అవ‌కాశాలు ఉండ‌డంతో ఆశావ‌హులు ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు చేస్తున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో రేవంత్‌ సహా నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల నుంచి ఇద్దరు చొప్పున, ఎస్టీ.. బ్రాహ్మణ, వెలమ, కమ్మ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. అయితే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓ నేతకు ఈసారి అవకాశం దక్కవచ్చని సమాచారం. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

అలాగే.. బీసీ, ఎస్సీ, ఎస్టీల నుంచి ఒక్కొక్కరిని తీసుకునేందుకు ఆస్కారం ఉందంటున్నారు. బీసీల్లో గౌడ సామాజిక వర్గం నుంచి పొన్నం ప్రభాకర్‌, మున్నూరుకాపు/పద్మశాలి సామాజిక వర్గాల నుంచి కొండా సురేఖను ఇప్పటికే క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. దీంతో ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరి పేరు మంత్రివర్గ విస్తరణలో ప్రముఖంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అయితే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి ఇప్పటికే సీఎం రేవంత్‌, మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. శ్రీహరి నియోజకవర్గం మక్తల్‌ కూడా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే ఉంది. దీంతో మరికొందరు బీసీ ఎమ్మెల్యేల పేర్లనూ ఆయనతో పాటుగా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఇటు ఎస్టీల్లో ఆదివాసీ వర్గం నుంచి సీతక్క ఉన్న నేపథ్యంలో విస్తరణలో లంబాడా వర్గానికి ఈసారి చోటు దక్కనుందని సమాచారం. ఈ కోటాలో బాలూనాయక్‌ పేరు ప్రముఖంగా పరిశీలనలో ఉంది. ఇక ఎస్సీ వర్గీకరణ అంశాన్ని బీజేపీ తెరపైకి తెచ్చిన నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గం నుంచి మరొకరిని తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే మాల సామాజిక వర్గం నుంచి పార్టీ ఎమ్మెల్యేలు గడ్డం వివేక్‌, గడ్డం వినోద్‌లు ఇప్పటికే పోటీలో ఉన్నారు. మాదిగ సామాజిక వర్గం నుంచి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యేలు, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్లను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేసినా ఉమ్మడి నల్లగొండ నుంచి ఉత్తమ్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో పాటుగా ముగ్గురికి చోటు దక్కినట్లవుతుంది.  ఆరో బెర్త్‌ను ఇతర సామాజిక వర్గాలకు సర్దుబాటు చేస్తారా.. లేక పెండింగ్‌లో పెట్టి లోక్‌సభ ఎన్నికల తర్వాత దానిపై నిర్ణయం తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY