తెలంగాణ ప్రాంత సీనియర్ టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీ రవీంద్రనాయక్ ఈ రోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరారు. వీరికి బీజేపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ పార్టీ సభ్యత్వ రసీదు అందజేశారు. తరువాత పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ను కలుసుకున్నారు. ఈ చేరిక కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కూడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవూరి మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ పునరేకీకరణ కోసమే బీజేపీ చేరినట్టు స్పష్టం చేసారు.
తనకు టీడీపీ పార్టీపైనా, చంద్రబాబు పైన ఎటువంటి వ్యతిరేకత లేదని తెలంగాణకు గతంలో టీడీపీ అన్ని విధాలుగా న్యాయం చేసిందని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన వాక్చాతుర్యంతో టీడీపీ పై ఆంధ్ర పార్టీ ముద్ర వేశారని రేవూరి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వలేమితో రోజు రోజుకి దిగజారిపోతుందని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున విద్యుత్ అవినీతికి పాల్పడుతొందని చెప్పారు. రాష్ట్రంలో యూరియా కొరతను సీఎం పరిష్కరించలేక, కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ బయటకు వచ్చి రైతుల ఎదురుకుంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు.
[subscribe]
[youtube_video videoid=jSvDeVv-Wwo]