తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. జనవరి 7, మంగళవారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికలను ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల ప్రకటించింది. కరీంనగర్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా 9 కార్పోరేషన్స్, 120 మున్సిపాలిటీల్లో 325 కార్పోరేటర్, 2,727 కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని ఆయన తెలిపారు. జిల్లా ఓటర్ల ముసాయిదా జాబితా, తుది జాబితాకు తేడా ఉన్నందునే కరీంనగర్ కార్పోరేషన్‌కు నోటిఫికేషన్ జారీ చేయలేదని అన్నారు. మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ల ఎన్నిక తేదీని తర్వాత ప్రకటిస్తామని నాగిరెడ్డి వెల్లడించారు. అలాగే నోటిఫికేషన్ జారీచేసిన మున్సిపాలిటీల్లో ఎన్నికల అధికారులు బుధవారం నోటీసులు జారీ చేస్తారని, ఉదయం 10.30 గంటల నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని చెప్పారు. ఇక మున్సిపాలిటీల్లో అభ్యర్థి ఖర్చు రూ.లక్ష, కార్పోరేషన్లలో అభ్యర్థి ఖర్చు రూ. లక్షా 50 వేలకు పరిమితి విధించినట్టుగా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముందుగా రిజర్వేషన్లు ఖరారు కాకుండానే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కోర్టు తీర్పు తర్వాత ఎలక్షన్ కమిషనర్ వి.నాగిరెడ్డి నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలియజేశారు.
ఎన్నికలకు సంబంధించి ముఖ్యమైన తేదీలు:
- నామినేషన్ల స్వీకరణ – జనవరి 8 నుంచి మొదలు
- నామినేషన్ల స్వీకరణకు తుది గడువు – జనవరి 10
- నామినేషన్ల పరిశీలన- జనవరి 11
- నామినేషన్ల తిరస్కరణకు అప్పీల్ – జనవరి 12
- నామినేషన్ల ఉపసంహరణ గడువు- జనవరి 14
- అభ్యర్థుల జాబితా ప్రకటన – జనవరి 14
- పోలింగ్ – జనవరి 22 ఉదయం 7 గం. నుంచి సాయంత్రం 5 గం. వరకు
- రీపోలింగ్ (అవసరముంటే) – జనవరి 24
- ఓట్ల లెక్కింపు పక్రియ – జనవరి 25
[subscribe]
















































