స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఆగస్టు 21వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ప్రజాప్రతినిదులు, అధికారులు, సిబ్బంది, అన్ని వర్గాల ప్రజలు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. బుధవారం అరణ్య భవన్ లో అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా అటవీ అధికారులు, హెఛ్ఎండీఏ, జీహెఛ్ఎంసీ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ నేలంతా పులకరించే విధంగా పల్లె, పట్టణాల్లో సామూహిక ప్రాంతాలు, ఖాళీ స్థలాలు, చెరువులు, సాగునీటి ప్రాజెక్టుల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నర్సరీల్లో మొక్కల లభ్యతకు అనుగుణంగా మొక్కలు నాటే విధంగా చూడాలన్నారు. మొక్కలు నాటడమే కాకుండా నాటిన మొక్కలను సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని కార్యచరణ ప్రణాళిలను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. మున్సిపాలిటీల్లో ఎక్కువ మొక్కలు నాటేలా ప్రాధాన్యతనివ్వాలన్నారు.
హరితహరంలో ఇప్పటి వరకు 264 కోట్ల మొక్కలు నాటామని, ఎనిమిదవ విడత హరితహారంలో 19. 54 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా చేపట్టిన ఈ కార్యక్రమంతో లక్ష్యానికి మరింత చేరువవుతామని చెప్పారు. అనంతరం అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ, స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మొక్కలు నాటే అద్భుతమైన అవకాశం వచ్చిందని, కెరీర్ లో ఇలాంటి అవకాశం రావడం చాలా అరుదని, ఇంత గొప్ప కార్యక్రమంలో అధికారులందరూ పాల్గొని గ్రాండ్ సక్సెస్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, అదనపు పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఏ.కే.సిన్హా, డీసీఎఫ్ శాంతారం, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY