రాష్ట్రంలో మరో 5 కొత్త ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు తెలంగాణ కేబినేట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు చట్టం ప్రకారం సంబంధింత నియమనిబంధనలకు లోబడి ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీలను అనుమతించాలని ఇందుకు సంబంధించి విద్యాశాఖ, వ్యవసాయశాఖలు చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది. కేబినేట్ అనుమతించిన కొత్త ప్రైవేట్ యూనివర్సిటీలల్లో CII, AMITY, MNR, GURUNANAK, NICMAR తో పాటు కావేరి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ, ఫార్మా యూనివర్సిటీలను స్థాపించాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ, ఇవి త్వరగా ఏర్పాటయ్యేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు.
విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల ఏర్పాటును కేవలం హైదరాబాద్ కే పరిమితం కాకుండా ఇతర నగరాలకు విస్తరింపచేయాలని సీఎం సూచించారు. దీనివల్ల హైదరాబాద్ పై ఒత్తిడి తగ్గడంతో పాటు, ఇతర నగరాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ముఖ్యంగా వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో నూతన ఉన్నత విద్యాసంస్థల స్థాపనను ప్రోత్సహించాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిని కేబినేట్ ఆదేశించింది.
గ్రూప్ 1, గ్రూప్ 2, ఇతర గెజిటెట్ పోస్టుల నియామకాల్లో ఇంటర్వ్యూ రద్దు:
అదే విధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, ఇతర గెజిటెట్ పోస్టుల నియామకాల్లో పాదర్శకత కోసం ఇక నుంచి కేవలం లిఖితపరీక్షనే ప్రమాణంగా తీసుకోవాలనీ, ఇంటర్వ్యూ అవసరం లేదనే ప్రతిపాదనకు రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. ఐటి తదితర పరిశ్రమల స్థాపన కేవలం నగరంలోని గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాలకే పరిమితం కాకూడదని, ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిపంజేయాలని తద్వారా హైదరాబాద్ నలుమూలలా సమానమైన అభివృద్ధి జరుగుతుందని సీఎం కేసీఆర్ అన్నారు.
పోలీస్ రిక్రూట్ మెంట్ లో అభ్యర్థుల వయోపరిమితి అర్హతలో 3 సంవత్సరాలు సడలింపు:
గతంలో ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ పరిమితిని 65 సంవత్సరాలకు పెంచింది. తాజాగా మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లను డైరక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్, అడిషనల్ డైరక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ గా నియమించడానికి అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు జరపబోతున్న విషయం తెలిసిందే. పోలీస్ రిక్రూట్ మెంట్ కు సంబంధించి అభ్యర్థుల వయోపరిమితి అర్హతలో 3 సంవత్సరాలు సడలించాలని కేబినేట్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగార్థుల నుండి వచ్చిన అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకునట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ