ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్రమైన చర్చ జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం యొక్క ఆదాయంలో 15.3 శాతం వృద్ధిరేటు నమోదైనట్లు అధికారులు కేబినెట్ కు తెలిపారు. అయితే, కేంద్రం ప్రభుత్వం నుంచి సీఎస్ఎస్, వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు మైనస్ -12.9 శాతం తగ్గినప్పటికీ ఈ వృద్ధి రేటు నమోదు చేయడం గమనార్హమని సీఎం కేసీఆర్ అన్నారు.
“ముఖ్యంగా కేంద్రం నిధులు విడుదల చేయడంలో ఎస్.ఎన్.ఏ అకౌంట్లు అనే కొత్త పద్ధతి తేవడం ద్వారా రాష్ట్రాలకిచ్చే నిధులలో తీవ్రమైన జాప్యం జరుగుతుంది. అంతేకాక ఎఫ్.ఆర్.బి.ఎం పరిమితులను సకాలంలో ఇవ్వకుండా పోవడంతోపాటు, పరిమితుల్లో కూడా కోతలు విధించడం జరిగింది. ఎఫ్.ఆర్.బి.ఎంలో కోతలు విధించకుండా ఉండి ఉంటే రాష్ట్రం యొక్క ఆదాయం మరింతగా పెరిగి, దాదాపు 22శాతం వృద్ధిరేటు నమోదయ్యేది. సీ.ఎస్.ఎస్. పథకాలలో గత 8 సంవత్సరాల్లో రాష్ట్రానికి రు.47,312 కోట్లు నిధులు మాత్రమే వచ్చాయి” అని ఆర్థికశాఖ అధికారులు కేబినెట్ కు వివరించారు. అయితే, గత 4 ఏండ్లలో ఒక్క రైతుబంధు పథకం కిందనే రైతులకు రూ.58 వేల 24 కోట్ల పంట పెట్టుబడి సాయం అందించడం జరిగిందని వారు తెలియజేశారు.
గత ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 1 లక్ష 84 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా, అందులో సీఎస్ఎస్ పథకాల కింద అందింది కేవలం రూ.5,200 కోట్లు మాత్రమే. అంటే మొత్తం రాష్ట్రం పెట్టిన ఖర్చులో 3శాతం కంటే తక్కువ మాత్రమే కేంద్ర పథకాల కింద నిధులు అందాయి. కేంద్రం అవలంభిస్తున్న విధానాల వల్ల రాష్ట్రాల వృద్ధి రేటు కుంటుపడుతుందని, రాష్ట్రం సాధించిన ప్రగతి కేంద్ర ప్రభుత్వం కూడా సాధించి ఉంటే, రాష్ట్ర జీఎస్డీపీ మరో 3 లక్షల కోట్ల రూపాయలు పెరిగి, 14.50 లక్షల కోట్ల రూపాయలకు చేరుకునేదని అభిప్రాయపడ్డారు. దేశ జనాభాలో మన రాష్ట్ర జనాభా రెండున్నర శాతం అయినప్పటికీ, దేశ ఆదాయానికి 5 శాతం తెలంగాణ కంట్రిబ్యూట్ చేయడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర స్వంత పన్నుల ఆదాయ వృద్ధిలో 11.5 శాతంతో తెలంగాణ దేశంలోనే ప్రధమస్థానంలో ఉందని తెలపడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరం 2014-15లో రాష్ట్రం యొక్క ఆదాయం రూ.62 వేల కోట్లు ఉండగా, గత సంవత్సరానికి 1 లక్షా 84వేల కోట్లు వరకు పెరగడం జరిగింది. అంటే ఏడేండ్లలోనే తెలంగాణ రాష్ట్రం మూడు రెట్ల వృద్ధిని సాధించి, దేశంలో అగ్రగామిగా నిలిచిందని ఆర్థికశాఖ అధికారులు కేబినెట్ కు వివరించారు.
ఐటీరంగంలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం, ఐటీరంగ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ హర్షం:
ఐటీ రంగంలో గత సంవత్సరం 1 లక్షా 55 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించిన తెలంగాణ రాష్ట్రం, దేశంలో అగ్రగామిగా నిలిచిందని ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ కేబినెట్ కు వివరించారు. ఐటీ రంగంలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు నగరంలో 1 లక్షా 48 వేల ఉద్యోగాలను కల్పించగా, హైదరాబాద్ అంతకంటే ఎక్కువగా 1 లక్షా 55 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు. ఐటీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక విధానాలు, ఇన్సెంటివ్ లు, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలు, మౌలిక వసతుల కల్పన, సుస్థిర శాంతి భద్రతలు, నిరంతరాయ నాణ్యమైన విద్యుత్ సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, మానవ వనుల లభ్యత వల్ల ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ను, ఐటీశాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్ ను, ఇతర అధికారులను సీఎం కేసీఆర్ ప్రశంసించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY