తెలంగాణ రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థ రద్దు నేపథ్యంలో వీఆర్వోలు ఆందోళన చెందవద్దని, వారిని స్కేల్ ఉద్యోగులుగా గుర్తిస్తామని, వారి స్థాయికి తగట్టుగా వివిధ శాఖల్లో వీఆర్వోలకు ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు అసెంబ్లీలో రెవెన్యూ బిల్లుపై చర్చ సందర్భంగా విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్‌ఏ)లకు కూడా సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. వీఆర్‌ఏలకు పే స్కేల్ అమలుచేయడంతో పాటుగా, ఒకవేళ వారు పదవీ విరమణ కోరితే కుటుంబంలోని వారసులకు ఆ ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.
ఎన్నో సంవత్సరాలుగా గ్రామస్థాయిలో వారు అందిస్తున్న సేవలను దృష్టిలో ఉంచుకుని, మానవతా దృక్పధంతో వారు కోరుకుంటే వారి బదులు ఇంట్లో పిల్లలకు ఎవరికైనా ఒకరికి వీఆర్‌ఏ ఉద్యోగం ఇవ్వనున్నట్టు తెలిపారు. వీఆర్‌ఏ ఉద్యోగుల్లో ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారని సీఎం అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక వారికి రూ.10 వేలు అందజేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ గ్రామ రెవెన్యూ అధికారుల రద్దు బిల్లు -2020 కు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థ పూర్తిగా రద్దు అవనుంది.
.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu