తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఇ.డబ్ల్యు.ఎస్.) పదిశాతం రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు అమలుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు జీవో 33 పేరుతో ఉత్తర్వులు జారీ చేసింది.
రాజ్యాంగ చట్ట 103వ సవరణ, 2019 ప్రకారం ఆర్థికంగా వెనుకబడినవర్గాలకు ఉన్నత విద్యాసంస్థలు, ప్రైవేట్ విద్యాసంస్థలు, రాష్ట్రాలలోని మైనారిటీ ఎడ్యుకేషనల్ సంస్థలు మినహా అన్ని ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ సంస్థల్లో, అలాగే ఉద్యోగాల్లో చేరేటప్పుడు 10 శాతం రిజర్వేషన్స్ అమలు అయ్యేలా కేంద్రం నిర్ణయించింది. ఇకపై తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ.డబ్ల్యూ.ఎస్ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన రూల్స్, గైడ్ లైన్స్ ను సాధారణ పరిపాలన శాఖ, విద్యాశాఖలు త్వరలోనే వేర్వేరుగా విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇక ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు తమ రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే రాష్ట్రంలో ఇ.డబ్ల్యు.ఎస్ లకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే బలహీన వర్గాలకు 50 శాతం మేర రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఇ.డబ్ల్యు.ఎస్ తో కలుపుకుని ఇకపై 60 శాతం రిజర్వేషన్లు అమలుకానున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ