హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల పరివాహక ప్రాంతానికి సంబంధించి అమల్లో ఉన్న జీవో నెంబర్ 111 ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఇటీవలే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీవో 111 పరిధిలో గల 84 గ్రామాల్లో ఆంక్షలను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంక్షలను ఎత్తివేస్తూ తాజాగా రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ జీవో 69ను విడుదల చేసింది. అలాగే ఈ రెండు జలాశయాలు కాలుష్యం కాటుకు గురికాకుండా, నీటి నాణ్యత దెబ్బతినకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని తాజా జీవోలో సూచించారు. ఈ పరిధిలోని వివిధ ప్రదేశాలలో వికేంద్రీకృత మురుగునీటి శుద్ధి కర్మాగారాల (ఎస్టీపీ) ఏర్పాటు, శుద్ధి చేసిన నీటిని ఈ రెండు రిజర్వాయర్లలోకి వెళ్లనివ్వకుండా మళ్లింపు మార్గాల నిర్మాణం, భూగర్భ జలాల నాణ్యత నిర్వహణ, ఈ రెండు రిజర్వాయర్లలోకి వ్యవసాయ ఉపరితల ప్రవాహం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడం, నీటి నాణ్యతను నిర్ధారించడానికి తగినట్లుగా భావించే ఏవైనా ఇతర చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ముందుగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల పరివాహక ప్రాంతంలో కాలుష్యం కలిగించే పరిశ్రమలు, ప్రధాన హోటళ్లు, నివాస కాలనీలు మరియు ఇతర సంస్థలు ఎఫ్టీఎల్ నుండి 10 కిలోమీటర్ల వరకు దాదాపు లక్షా 32వేల ఎకరాల విస్తీర్ణంలో గల 84 గ్రామాలను కవర్ చేయడాన్ని నిషేధిస్తూ మార్చి 8, 1996న జీవో 111 పేరుతో ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఆ సమయంలో హైదరాబాద్ నగరానికి ప్రధాన తాగునీటి వనరుగా ఉన్న ఈ రెండు జలాశయాల పరివాహక ప్రాంతాన్ని రక్షించే లక్ష్యంతో ఇది జరిగింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు అందించిన వివరాల ప్రకారం, జీవో 111 జారీ చేయబడినప్పుడు ఈ రెండు జలాశయాలు 27.59% తాగునీటి వ్యవస్థాపిత సామర్థ్యంలో ఉన్నాయి. అయినప్పటికీ, హైదరాబాద్‌కు త్రాగునీటి మొత్తం స్థాపిత సామర్థ్యం రోజుకు 145 మిలియన్ గ్యాలన్ల నుండి 602 మిలియన్ గ్యాలన్ల కి పెరిగింది మరియు అదనంగా 344 మిలియన్ గ్యాలన్లు కూడా అమలులో ఉంది. దీని ఫలితంగా ఈ జలాశయాల సామర్ధ్యం 1.25% కంటే తక్కువగా ఉంది మరియు అవి హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరాకి ప్రధాన వనరుగా కూడా లేవని తెలిపారు.
జీవో 111 జారీకి అంతర్లీన అంశంగా ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలపై హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలు ఇకపై ఆధారపడి ఉండవు అనే వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుని, ప్రభుత్వం ఈ విషయాన్ని నిశితంగా పరిశీలించిన తర్వాత జీవో 111లో విధించిన పరిమితులను తొలగించాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. అలాగే ఈ రెండు జలాశయా నీటి నాణ్యతపై ఎలాంటి ప్రభావం పడకూడదనే షరతుకు లోబడి, ఈ రెండు రిజర్వాయర్‌ల నీటి నాణ్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలను ప్రారంభించిందని తెలిపారు.
ఇందుకోసం మార్గదర్శకాలు మరియు వివరణాత్మక నిబంధనలు రూపొందించడానికై చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ అధ్యక్షతన, పురపాలక శాఖ స్పెషల్ సీఎస్, ఆర్ధిక శాఖ స్పెషల్ సీఎస్, నీటిపారుదల శాఖ స్పెషల్ సీఎస్, హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ మేనేజింగ్ డైరెక్టర్, పీసీబీ మెంబర్ సెక్రటరీ, హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్ సభ్యులుగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీ రెండు జలాశయాల నాణ్యతను పరిరక్షించే విస్తృత ప్రాథమిక లక్ష్యాన్ని పెట్టుకుని, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పై పని చేస్తూ, దాని నివేదికను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశాలు ఇచ్చారు.
కమిటీ యొక్క టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ :
- ఈ రెండు రిజర్వాయర్‌లకు రక్షణ మరియు కాలుష్య నివారణకు చర్యలను సూచించడం
- గ్రీన్ జోన్లను కేటాయించడంతోపాటు జోనింగ్ కోసం విస్తృత మార్గదర్శకాలను సూచించడం
- ఈ ప్రాంతంలో ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి పద్ధతులను సూచించడం
- రోడ్లు, ప్రధాన కాలువలు, ఎస్టీపీలు, డైవర్షన్ డ్రెయిన్‌లు వంటి ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చేపట్టేందుకు వివిధ వనరుల సమీకరణ మార్గాలను సూచించడం
- ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలను చేపట్టడానికి మరియు అభివృద్ధిని నియంత్రించడానికి తగిన సంస్థాగత ఫ్రేమ్ వర్క్‌ను సూచించడం
- ఈ ప్రాంతంలో ఏదైనా లేఅవుట్ / బిల్డింగ్ అనుమతులు మంజూరు చేసేటప్పుడు పట్టుబట్టవలసిన అవసరమైన నియంత్రణ చర్యలను సూచించడం
- ఈ ప్రాంతంలోని పరిణామాలను సమర్థవంతంగా నియంత్రించేందుకు ప్రస్తుతం ఉన్న చట్టపరమైన ఫ్రేమ్ వర్క్‌లో ఏవైనా మార్పులు చేయాల్సి ఉంటే అవసరమైన మార్పులను సూచించడం
- మార్గదర్శకాలను ఖరారు చేసేటప్పుడు వివరణాత్మక నిబంధనలు తప్పనిసరిగా ఉండాలి. సరైన మురుగునీటి శుద్ధి కర్మాగారాలు (ఎస్టీపీ) ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా, శుద్ధి చేసిన నీటిని ఈ రెండు రిజర్వాయర్లలోకి వెళ్లనివ్వకుండా మళ్లింపు మార్గాల నిర్మాణం చేపట్టాలి
- ఈ కమిటీ ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చడానికి వనరులను సేకరించే మార్గాలు మరియు పరిశీలిస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ