ఆక్సిజన్, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ బ్లాకు మార్కెటింగ్ దందాకు తెలంగాణలో ఆస్కారం ఇవ్వం: హోమ్ మంత్రి

Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, Mahmood Ali, Mahmood Ali Reviewed on Corona Situation, Mahmood Ali Reviewed on Corona Situation with Police Officers, Mango News, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Deaths, Telangana Home Minister, Telangana Home Minister Mohd Mahmood Ali, Telangana Home Minister Mohd Mahmood Ali Reviewed on Corona Situation, Telangana Home Minister Mohd Mahmood Ali Reviewed on Corona Situation with Police Officers, Total COVID 19 Cases

తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 సెకండ్ వేవ్ నేపధ్యంలో ప్రస్తుతం పోలీస్ శాఖ ద్వారా తీసుకుంటున్న, తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహామూద్ అలీ బుధవారం నాడు లక్డీకాపూల్ లోని తన కార్యాలయంలో, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్త, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్, రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ ఎం భగవత్, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్, హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమీషనర్ అనిల్ కుమార్ లతో సమీక్ష జరిపారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై, వివిధ విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. పోలీస్ శాఖ గత సంవత్సరం నుండి కరోనా మొదటి వేవ్ లో చాలా సమర్ధవంతంగా పనిచేసిందని, ప్రస్తుతం సెకండ్ వేవ్ నేపధ్యంలో పటిష్టంగా పనిచేస్తోందని హోం మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఆక్సీజన్ కొరత లేదు:

ప్రజలకు అవసరమైన సేవలు అందించడంలో పోలీస్ శాఖ ముందు ఉంటుందని, ఎప్పటిలాగే క్రియాశీలక పాత్ర పోషిస్తోందని, మెడికల్ అండ్ హెల్త్ మరియు జి.హెచ్.యం.సి. శాఖలతో సమన్వయంతో పనిచేస్తోందని మంత్రి మహమూద్ అలీ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్సీజన్ కొరత లేదని, రేమేడిసివిర్ ఇంజక్షన్ మొదలగు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అన్ని ఆసుపత్రులలో సిద్దంగా ఉంచడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని చెప్పారు. అయితే చాలామంది భయంతోనో, ముందు జాగ్రత్తతో ఆక్సిజన్ సిలిండర్లు, ఇంజక్షన్లు ఇళ్ళల్లో నిలువ చేసుకొంటున్నట్లు దృష్టికి వచ్చిందని, దీనివల్ల సిలిండర్ల తాత్కాలిక కొరత ఏర్పడే ప్రమాదం ఉందని, అదేవిధంగా మందులు పాడైపోయే ప్రమాదం ఉందని, అలా నిలువచేసుకునే అవసరం లేదని, సిలండర్లు రీఫిల్లింగ్ కొరకు ఇబ్బంది ఏర్పడి అవసరమైన వారికి దొరకని పరిస్థితి వస్తుందని పేర్కొంటూ, ప్రజలు ఈ విషయంలో ఆందోళనపడి అవసరం లేకపోయినా నిలువ చేసుకోవద్దని, ప్రభుత్వం ఆక్సిజన్ మరియు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అందుబాటులో ఉంచడానికి పటిష్ట చర్యలు తీసుకుందని తెలిపారు.

ఆక్సిజన్, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ బ్లాకు మార్కెటింగ్ దందాకు తెలంగాణలో ఆస్కారం ఇవ్వం:

ఆక్సిజన్ మరియు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ బ్లాకు మార్కెటింగ్ చేసే వారిపై పోలీస్ ఉక్కు పాదం మోపుతుందని, అట్టివారిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఆక్సిజన్, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ బ్లాకు మార్కెటింగ్ దందాకు తెలంగాణాలో ఆస్కారం ఇవ్వబోమని, దీనిపై సీఎం కేసీఆర్ చాలా సీరియస్ గా ఉన్నారని హోం మంత్రి పేర్కొన్నారు. ప్రజలు అందరూ తప్పకుండా కరోనా జాగ్రతలు పాటించాలని, మాస్కులు విధిగా ధరించాలని, అవసరమైతే తప్ప బయటకి రాకుండా ఉండాలని, బయటకి వెళ్ళినప్పుడు విధిగా భౌతిక దూరం పాటించాలని, చేతులను శుభ్రంగా కడ్డుక్కోవాలని, సానిటైజ్ చేసుకోవాలని హోం మంత్రి విజ్ఞప్తి చేసారు. ప్రజా సమావేశాలపై నిషేధం ఉందని, హైకోర్టు కుడా ఈ విషయంలో ఆదేశాలు ఇచ్చిందని, ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని హోం మంత్రి కోరారు.

వదంతులు, ఇతర అసత్య ప్రచారాలకు పాల్పడితే కఠిన చర్యలు:

రంజాన్ మాసం నడుస్తున్న కారణంగా ముస్లీం సోదరులు నమాజ్, తరావీలు చేసే సమయంలో ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలని, అన్ని జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేసారు. జ్వరం, జలుబు మొదలగు ఇబ్బందులు ఉంటె, ఆలస్యం చేయకుండా వెంటనే కరోనా పరీక్ష చేసుకుని, వైద్యం చేయించుకోవాలని, నిర్లక్ష్యం, కాలయాపన చేస్తే వ్యాధి తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని హోం మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని ఆసుపత్రులలో పడకలు పెంచడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, ఈ రోజు హైదరాబాద్ మెడికల్ హబ్ గా ఉందని, మహారాష్ట్ర, కర్ణాటక మరియు ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్ కు చికిత్స కొరకు ప్రజలు వస్తున్నారని, ప్రభుత్వం ప్రజల చికిత్స కొరకు అన్ని చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలలో వదంతులు, ఇతర అసత్య ప్రచారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హోం మంత్రి అన్నారు. ఈ పరిస్థితులలో ప్రజలకు సేవ చేయడంలో పోలీస్ శాఖ ముందు ఉండాలని, పోలీస్ ఉన్నతాధికారులను కోరారు. పోలీస్ శాఖ ప్రజల సేవకొరకు ఎల్లప్పుడూ ఉంటుందని హోమ్ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ