తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువుగా ఉంది. దీంతో కరోనా ప్రభావం రాజ్‌భవన్ పై కూడా పడింది. ముందుగా స్పెషల్ పోలీసు బెటాలియన్ లో కొంతమందికి కరోనా పాజిటివ్ గా తేలడంతో మిగతా సిబ్బందికి కూడా శనివారం, ఆదివారం నాడు రాజ్‌భవన్ లో రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. మొత్తం 395 మందికి పరీక్షలు జరగగా, 48 మందికి కరోనా పాజిటివ్ గా, 347 మందికి నెగటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. 28 మంది పోలీసు సిబ్బందికి పాజిటివ్‌గా తేలడంతో వారిని వెంటనే ఐసొలేషన్ కు తరలించారు. ఇక 10 మంది రాజ్‌భవన్ సిబ్బందికి మరియు సిబ్బంది యొక్క 10 మంది కుటుంబ సభ్యులకు కూడా పాజిటివ్ గా తేలడంతో వారిని తదుపరి చికిత్స కోసం ఎస్.ఆర్.నగర్ లోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో చేర్చారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులో గవర్నర్ కు కరోనా నెగటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని గవర్నర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రెడ్ జోన్లలో ఉన్నవారు, మరియు కరోనా వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్నవారు త్వరగా పరీక్షలు చేయిచుకోవాలని కోరారు. ప్రారంభంలోనే నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే, మనల్ని మనం కాపాడుకోవడమే కాకుండా ఇతరులను కూడా రక్షించినవారు అవుతాం. కరోనా వైద్య పరీక్షల కోసం వెనుకాడకూడదని చెప్పారు. మరోవైపు కరోనా విషయంలో ‘4టీ’ విధానాన్ని పాటించాలని గవర్నర్ సూచించారు. టెస్ట్, ట్రేసింగ్, ట్రీట్, టీచ్ విధానాన్ని పాటిస్తూ ఎదుటివారు అనుసరించేలా ప్రోత్సహించాలని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu