నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచీ ఒక్కరే పదే పదే ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఒకాయనకే స్థానిక ప్రజలు పట్టం కడుతున్నారు. అదే రాజేంద్రనగర్ నియోజకవర్గం. దాని పూర్వాపరాల్లోకి వెళ్తే.. 15 ఏళ్లకు పూర్వం చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న రాజేంద్రనగర్, శంషాబాద్ మండలాలు 2002 డీలిమిటేషన్ ప్రకారం 2009లో రాజేంద్రనగర్ నియోజకవర్గంగా ఏర్పాటైంది. అప్పటి నుంచి మూడు పర్యాయాలు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యేగా మైలార్‌దేవుపల్లికి చెందిన టి.ప్రకాశ్‌గౌడ్ గెలుస్తూ వస్తున్నారు.
2009, 2014లలో జరిగిన సాధారణ ఎన్నికలలో టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచిన ప్రకాశ్‌గౌడ్ 2018లో టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) తరఫున పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు. రాజేంద్రనగర్, శంషాబాద్ మండలాలు నేడు మూడు మండలాలుగా మారి రాజేంద్రనగర్, గండిపేట్, శంషాబాద్ మండలాలుగా ఏర్పడ్డాయి. 2023లో జరుగుతున్న సాధారణ ఎన్నికలలో తిరిగి ప్రకాశ్‌గౌడ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి నాలుగోసారి గెలుపుకోసం ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణలో రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో శంషాబాద్‌లో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, దేశంలో పేరుగాంచిన పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే సగభాగం ఇక్కడే ఉంది. ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన ఐటీ సంస్థలతో పాటు జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్‌రోడ్డు ఈ నియోజకవర్గం పరిధిలో నుంచి ప్రధాన ప్రాంతాలకు అనుసంధానంగా ఉంది.
ఇటీవల కాలం వరకు జంట నగరాలకు తాగునీరు అందించిన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్(గండిపేట్) జలాశయాలు రాజేంద్రనగర్‌లోనే ఉన్నాయి. వీటికి తోడు భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఐసీఏఆర్)కు చెందిన అనేక పరిశోధనా సంస్థలకు రాజేంద్రనగర్ పుట్టినిల్లు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నర్సింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్‌లోనే ఉన్నాయి. నియోజకవర్గంలో కాటేదాన్, సాతంరాయి, గగన్‌పహాడ్ పారిశ్రామిక వాడలు, ఐటీ సంస్థలు ఉండడంతో దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు రాజేంద్రనగర్‌లో నివాసం ఉంటారు. వారితో మెజార్టీ ప్రజలు ప్రకాశ్‌గౌడ్‌కే పట్టం కడుతూ వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ బీజేపీ నుంచి తోకల శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి కస్తూరి నరేందర్ పోటీలో ఉన్నారు. ఈ క్రమంలో ఓటర్లు ఈసారి ఎవరికి పట్టం కడతారో అనేది ఆసక్తిగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE







































