టీఎస్ ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు మరోసారి షాకిచ్చింది. అయితే ఈసారి లగేజీ చార్జీలను భారీగా పెంచేసింది. ఇటీవల రెండు సార్లు వివిధ సెస్సులు పేరుతో ప్రయాణికుల ఛార్జీలను పెంచిన ఆర్టీసీ తాజాగా లగేజీ ఛార్జీలను పెంచింది. ఈ మేరకు టీఎస్ ఆర్టీసీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ నెల 22వ తేదీ (శుక్రవారం) నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. బస్సుల్లో తరలించే అన్ని రకాల సామగ్రిపై కేటగిరీల వారీగా టికెట్ల రేట్లను విధించింది. ఈ క్రమంలో పాత చార్జీ రూ.1, రూ.2 స్థానంలో ఏకంగా రూ.20, రూ.50 వరకూ పెంచేసింది. పల్లె వెలుగు బస్సులతో పాటు ఎక్స్‌ప్రెస్ బస్సులు అన్నింటికీ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.
అయితే 50 కిలోల వరకు ఉచితంగా అనుమతించిన ఆర్టీసీ ఆ తర్వాత నుంచి మాత్రం చార్జీలను విపరీతంగా పెంచేసింది. ప్రయాణికుడు ఉచితంగా తీసుకెళ్లే 50 కిలోల బరువు కూడా మూడు ప్యాకెట్లకు (బ్యాగులు, సూట్‌కేసులు మొ.వి) మించి ఉండకూడదని, అలాగే ప్రతి ప్యాకెట్ 20 కిలోల బరువు మించి ఉండకూడదని ఆర్టీసీ ప్రకటించింది. ఇక ఒక్కో ప్రయాణికుడు వంద కిలోలకు మించి బరువును తీసుకెళ్లకూడదు. వంద కిలోల్లో 50 ఉచితం కాగా, మిగిలిన 50 కిలోలు చార్జీ పరిధిలోకి వస్తుంది. 100 కిలోలకు మించి బరువు ఉంటే ప్రయాణికుల బస్సుల్లోకి అనుమతి లేదు, వారు తప్పనిసరిగా కార్గో బస్సుల్లోనే తరలించాలి. పల్లె వెలుగులో అయితే ప్రతి 25 కి.మీ చొప్పున, ఎక్స్‌ప్రెస్ మరియు ఆ పై కేటగిరీలో ప్రతి 50 కి.మీ చొప్పున చార్జీ మారుతుంది.
పల్లె వెలుగు బస్సుల్లో 25 కి.మీ. దూరానికి ఇప్పటివరకు ఉన్న రూ.1 చార్జీని ఒకేసారి రూ.20కి, అలాగే ఎక్స్‌ప్రెస్, ఆపై కేటగిరీ బస్సుల్లో ఇదే దూరానికి ఉన్న రూ.2 చార్జీని ఏకంగా రూ.50కి పెంచింది. కాగా తెలంగాణలో బస్సుల్లో లగేజీ చార్జీలు 2002వ సంవత్సరంలో ఖరారు చేసిన నామమాత్రపు రుసుములే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. 2002 తర్వాత అనేకసార్లు టికెట్ చార్జీలు పెంచినా లగేజీ చార్జీలను మాత్రం పెంచలేదు. అయితే ఇటీవల పెట్రలో, డీజిల్ ధరలు భారీగా పెరిగిన పరిస్థితుల్లో సంస్థను నష్టాల నుంచి బయటపడేసేందుకు తప్పడంలేదంటూ తాజాగా లగేజీ చార్జీలను కూడా పెంచేసింది. కాగా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో గరిష్ట లగేజీ పరిమితి 750 కిలోలు ఉండగా, సూపర్ లగ్జరీ 1,000 కిలోలు వరకు ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ