అవిభాజిత ఆంధ్రపదేశ్ 2014లో రెండు ముక్కలైంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ ఏర్పాటైంది. విభజన సమయంలో ఎన్నో ఉద్విగ్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధానంగా ఏపీవాసులు ఏదో వెలితిగా ఫీలయ్యారు. కుటుంబంలోని కొందరు వేరు కాపురానికి పోతున్నట్లుగా భావించారు. తెలంగాణవాసులు మాత్రం సుదీర్ఘకాలం నాటి కల నెరవేరినందుకు సంబరాలు చేసుకున్నారు. విభజన జరిగి పదేళ్లు అయిపోయింది. ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ ఎస్సే రెండు పర్యాయాలు రాష్ట్రాన్ని పాలించింది. కొత్తగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అవుతోంది. పదేళ్ల బీఆర్ ఎస్ పరిపాలనలోని లొసుగులను వెలుగులోకి తెస్తోంది. బంగారు తెలంగాణ నిర్మిస్తామన్న పేరుతో చేసిన విధ్వంసాన్ని లెక్కలతో సహా బయటపెడుతోంది. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారానూ వివరించే ప్రయత్నం చేస్తోంది. ఈక్రమంలో ఓ తరహా వాదన తెరపైకి వస్తోంది..
దాదాపు పదేళ్ల తర్వాత ఉమ్మడి రాష్ట్రం.. ఉమ్మడి రాజధాని ప్రస్తావన పదేపదే వినిపిస్తోంది. బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసాన్ని తెలిపే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రస్తావన తెలస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో కంటే గత పదేళ్లలోనే ఎక్కువ నష్టం జరిగిందని చెబుతోంది. ప్రాజెక్టుల నిర్మాణంలో అంతులేని అవినీతి జరిగింది అంటోంది. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను ఏపీ తరలించుకుపోతుంటే.. కేసీఆర్ సహకరించారని, ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో అవగాహన కుదుర్చుకొని వారి ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూశారని ధ్వజమెత్తారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కృష్ణా జలాలపై తెలంగాణకు అన్యాయం జరిగిందని పేర్కొంటోంది. ఓ సందర్భంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని గుర్తించే యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కన్నా కూడా గత పదేళ్లలోనే తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగింది. ప్రాజె క్టుల నిర్మాణంలో గత పదేళ్లలో జరిగినంత అవినీతి.. స్వతంత్ర భారతదే శంలోనే జరగలేదు. బచావ త్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఏపీకి గంపగుత్తగా 811 టీఎంసీలు కేటాయించింది.
అయితే పరివాహక ప్రాంతం, కరువు పీడిత ప్రాంతాలు, బేసిన్ వెంట నివసిస్తున్న జనాభా, సాగు ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకొని 65 శాతం నుంచి 70 శాతం నీటి వాటాకు పట్టుబట్టాల్సి ఉండగా.. 2015లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలను పంచుకోవడానికి వీలుగా కేసీఆర్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 1983లో తెలుగు గంగ ప్రాజెక్టుకు తాగునీటి కోసం నీటిని తరలించడానికి వీలుగా 11 వేల క్యూసెక్కులతో పనులు జరిగాయి. అనంతరం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 44 వేల క్యూసెక్కులను తరలించేలా విస్తరించారు. అయితే విభజిత ఏపీకి వైఎస్ జగన్ సీఎం అయ్యాక కేసీఆర్ ఆమోదంతో 92,500 క్యూసెక్కులను తరలించేలా పనులు జరిగాయి. అంతేకాకుండా రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం ఫ్లడ్ లైట్ల వెలుగులతో జరిగింది. ముచ్చుమర్రి నుంచి 5600 క్యూసెక్కులు, కేసీ కెనాల్‌కు 1000 క్యూసెక్కులు, 6300 క్యూసెక్కులతో మల్యాల వంటివన్నీ కేసీఆర్ మౌనాంగీకారంతోనే జరిగాయి’’ అని ఆరోపించారు.
చంద్రబాబు తర్వాత అధికారంలోకి వచ్చిన ఏపీ సీఎం జగన్, తెలంగాణ అప్పటి సీఎం కేసీఆర్ కలిసి బిర్యానీలు తిని.. ఏకాంత చర్చలు జరిపిన ఫలితంగానే శ్రీశైలం బ్యాక్‌వాటర్‌పై ఏపీ ప్రాజెక్టుల నిర్మాణానికి అంగీకారం కుదిరిందని ఉత్తమ్ ఆరోపించారు. 2019 మే 25న, 2020 జనవరి 13న ప్రగతిభవన్‌లో జగన్, కేసీఆర్ సమావేశమయ్యారని, అప్పుడు తీసుకున్న నిర్ణయాల ఫలితంగానే శ్రీశైలంలో 797 అడుగుల నుంచి నీటిని తరలించేలా 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతల పథకం జీవో నెం.203 విడుదలయిందని తెలిపారు. 2014 దాకా శ్రీశైలం నుంచి 47,850 క్యూసెక్కులను తరలించగా.. కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో 1,11,400 క్యూసెక్కుల నీటిని తరలించేలా సామర్థ్యం పెరిగిందన్నారు. మొత్తంగా రోజుకు 9.6 టీఎంసీలు, ఏకంగా నదినంతా మళ్లించేలా పనులు జరగాయని ఆరోపించారు.
తెలంగాణను పదేళ్ల పాటు పాలించిన బీఆర్ ఎస్ తప్పులు చూపిన ప్రయత్నంలో ఉమ్మడి పాలనే బాగుందని కాంగ్రెస్ నేతలు చెబుతుండడం చర్చనీయాంశం అవుతోంది. దీనిపై ఏపీలోనూ భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాజధానిని మరోసారి తెరపైకి తెస్తున్నారు. కాంగ్రెస్ వచ్చిన రెండు నెలల్లో పలుమార్లు ఉమ్మడి పాలనను గుర్తుచేయడంపై ఏపీ నేతలు, ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే.. బీఆర్ ఎస్ మాత్రం ఆ తరహా ప్రచారాన్ని ఖండిస్తోంది. ఎంతో కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణపై అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ బద్నాం చేస్తోందంటూ ఆరోపిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE