నెత్తురుచుక్క నేలరాలకుండా.. గొడవలకు తావివ్వకుండా.. కొట్లాటలను కట్టడి చేస్తూ తెలంగాణ ఎన్నికలను ముగించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అనూహ్యంగా దుబ్బాకలో జరిగిన ఘటన రాజకీయాలను కలవరానికి గురి చేసింది. ఇది జరిగి 20 రోజులకు పైనే అవుతున్నా.. ఎన్నికల వేళ దుబ్బాక నియోజకవర్గ ప్రచారంలో రోజూ తెరపైకి వస్తూనే ఉంది. కత్తిపోటుకు గురైన మెదక్ పార్లమెంటు సభ్యుడు, సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి అంబులెన్స్ లోనే వచ్చి నాడు నామినేషన్ వేశారు. ఇప్పటికీ ఆయన పూర్తిగా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో కత్తిపోట్లకు గురైన కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకోకపోతే మనలో మానవత్వమే లేదని భావించాల్సి వస్తుందని ప్రచారంలో బీఆర్ ఎస్ నేతలు నొక్కి ఒక్కానిస్తున్నారు.
మంత్రి హరీశ్‌రావు సహా.. బీఆర్ ఎస్ కార్యకర్తలు, ప్రభాకర్ రెడ్డి సతీమణి మంజుల, ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారు. తమ తండ్రి సౌమ్యుడు అని, చీమకు కూడా హాని తలపెట్టరని, ఎన్నడూ పరుషంగా మాట్లాడరని, అలాంటి వ్యక్తిని ఎందుకు చంపాలని అనుకున్నారో అర్థం కావడం లేదని ప్రభాకర్ రెడ్డి కూతురు కీర్తి ఆవేదన వ్యక్తం చేస్తూ ఓటర్లను కలుస్తున్నారు. తాము దుబ్బాకలో పుట్టి పెరిగామని, నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు వస్తే తమ కుటుంబానికి తీరని వ్యథను మిగిల్చారని అంటున్నారు. ప్రభాకర్ రెడ్డి ఏమీ ఆశించకుండా పదేళ్లు ఎంపీగా సేవలందించారని, ప్రజల కోసం సొంత డబ్బునే ఖర్చుపెట్టారని, ఆయన్ను ఇబ్బంది పెట్టినవారికీ సహాయం చేశారని సతీమణి మంజుల పేర్కొంటున్నారు. అలాంటి వ్యక్తి ప్రాణం తీసేందుకు యత్నించారంటే.. అడుగు బయటపెట్టేందుకే మనసు అంగీకరించడం లేదని కన్నీటి పర్యంతమవుతూ ఓటర్లను కలుస్తున్నారు.
అంతేకాకుండా.. సంక్షేమ పథకాలే శ్రీరామరక్షగా.. అభివృద్ధే ప్రచార అస్త్రంగా బీఆర్ఎస్ ప్రభుత్వం దూసుకెళ్తోంది. దుబ్బాకలో కొత్త ప్రభాకర్‌రెడ్డి కూడా ఇదే విజయ మంత్రాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. సొంత గడ్డను మరింత అభివృద్ధి చేసి చూపిస్తానంటున్నారు. కొత్త ప్రాజెక్టులు తీసుకువచ్చి.. ప్రతి మడికి నీళ్లు అందిస్తానంటున్నారు. కత్తి దాడి తర్వాత డాక్టర్లు విశ్రాంతి అవసరమని చెప్పినా.. నియోజకవర్గ ప్రజల్ని కలుస్తూ, కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. అయితే.. దుబ్బాకలో మళ్లీ కమలం జెండా ఎగరడం ఖాయమని సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన పలు దఫాలు నియోజకవర్గంలోని ఊళ్లను చుట్టేశారు. తాను కొట్లాడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నానని, కుటుంబ పాలనకు ఇక్కడి ప్రజలు వంత పాడరంటూ ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు.
మరోవైపు.. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి.. మంత్రిగా తన తండ్రి ముత్యం రెడ్డి చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. బీఆర్‌ఎస్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదని, బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని ప్రచారం సాగిస్తున్నారు. దుబ్బాక గడ్డపై భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో దుబ్బాక రాజకీయాలు ఆసక్తిగా మారాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE