తెలంగాణలో ప్రాజెక్టుల నిర్వహణపై దృష్టి పెట్టకపోవడం వల్లే రాష్ట్రంలో భారీ వరదలు సంభవించాయని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె సోమవారం లోటస్ పాండ్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ సరిగా లేదని, దీనికి సరిపడా సిబ్బంది కూడా లేరని అన్నారు. ఉమ్మడి ఏపీని వైయస్ఆర్ గారు ఎంతో అభివృద్ధి చేశారని, ఎంతోమందిని ప్రోత్సహించి వ్యాపారవేత్తలుగా మార్చారని చెప్పిన షర్మిల వైయస్ఆర్ ఎప్పుడూ ఒక్కరికే అన్ని ప్రాజెక్టులు ఇవ్వలేదని, కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఎందుకు అన్ని ప్రాజెక్టులు ఒక్కరికే అప్పగిస్తున్నారని ప్రశ్నించారు.
ప్రభుత్వం ఎంత దాచాలనుకున్నా కాళేశ్వరంలో వరదల సమయంలో ఏం జరిగిందో ప్రజలంతా చూశారని షర్మిల వ్యాఖ్యానించారు. కాళేశ్వరానికి ఉండే రక్షణ గోడ కూలిపోయిందని, దీంతో పంపు హౌస్ లోకి నీళ్లు వచ్చాయని, మోటార్లు అన్నీ మునిగి పోయాయని, గేట్లు పగిలిపోయి, సైడ్ వాల్స్ కూలిపోయాయని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారని, వేల కోట్లు ఖర్చు చేసి కరెంటు బిల్లులు కడుతున్నారని, ఉపయోగం లేని ప్రాజెక్టుపై ఇంత ఖర్చు ఎందుకని షర్మిల నిలదీశారు. ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వకున్నా కాళేశ్వరం కట్టిన పాపానికి వేల ఎకరాలు మునిగిపోయాయని, కాళేశ్వరం కట్టకముందు ఎప్పుడూ ఏ సమస్యా రాలేదని, గత మూడేళ్లుగా మాత్రమే మా భూముల్లోకి నీళ్లు వస్తున్నాయని రైతులు అంటున్నారని షర్మిల తెలియజేశారు.
కడెం ప్రాజెక్టు గేట్లు మార్చాలన్న డిమాండ్లను కేసీఆర్ పట్టించుకోలేదని, ప్రాజెక్టు గేట్లు పనిచేయకపోవడం వల్లే ఇంత పెద్ద వరద వచ్చిందని షర్మిల తెలిపారు. 33 మంది సిబ్బంది ఉండాల్సిన కడెం ప్రాజెక్టు దగ్గర ముగ్గురే ఉన్నారని, ఇది ముమ్మాటికీ నిర్వహణ లోపమేనని ఆమె స్పష్టం చేశారు. భద్రాచలంలో కరకట్ట ఉంటే ఈరోజు ఈ వరదలు సంభవించేవే కాదని, బాధితుల డిమాండ్ మేరకు కరకట్ట నిర్మించాలని డిమాండ్ చేశారు. వరదల్లో గూడు కోల్పోయినవారికి డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు కట్టివ్వాలని షర్మిల అన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.10 వేలు వరద బాధితులకి సరిపోదని, కనీసం ప్రతి కుటుంబానికి రూ.25 వేలు ఇవ్వాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY