ధరణి పోర్టల్ నిర్వహణ, మెరుగుపర్చాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

CM KCR Orders Over Dharani Portal Maintenance And Improvement,Mango News,Mango News Telugu,CM KCR, CM KCR Orders, dharani portal, dharani portal news, Dharani Portal Updates, KCR Over Dharani Portal, KCR Over Registration of Non-agricultural Lands in Dharani Portal,Registration of Non-agricultural Lands,Registration of Non-agricultural Lands in Dharani Portal,Telangana CM KCR,Telangana Dharani Portal,CM KCR,Telangana CM KCR,CM KCR Orders Over Dharani Portal Maintenance,Dharani Portal Improvement

వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశ్యంతో తెచ్చిన ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలు సాధిస్తున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఎవరి వద్దా పైరవీ చేసుకోవాల్సిన దుస్థితి లేకుండా నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు నెలల వ్యవధిలోనే లక్షా 6వేల మంది ధరణి ద్వారా స్లాట్ బుక్ చేసుకుని, వారిలో 80 వేల మంది రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకున్నారని సీఎం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 90 శాతం మంది రైతులు 5 ఎకరాల లోపు వారే ఉన్నారని, అలాంటి చిన్న రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూములు రిజిస్టర్ చేయించకుని, మ్యుటేషన్ చేయించుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

వ్యవసాయ భూముల విషయంలో నెలకొన్న కొద్ది పాటి సందిగ్ధతలను జిల్లా కలెక్టర్లు రెండు నెలల వ్యవధిలో పరిష్కరిస్తారని ప్రకటించారు. ధరణి పోర్టల్ లో మరిన్ని ఆప్షన్లు పెట్టి, మరింత మెరుగు పరుస్తున్నట్లు వెల్లడించారు. ధరణి పోర్టల్ నిర్వహణ, ఇంకా మెరుగు పర్చాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ గురువారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు అత్యంత పారదర్శంగా జరుగుతున్నాయని, పోర్టల్ లో మరిన్ని ఆప్షన్లు పెట్టి, మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.

సమావేశంలో విస్తృత చర్చ అనంతరం సీఎం కేసీఆర్ జారీ చేసిన ఆదేశాలు:

  • ధరణి పోర్టల్ రాకముందు రిజిస్ట్రేషన్ అయిన భూములను రిజిష్టర్డ్ డాక్యుమెంట్ల ఆధారంగా కొన్న వారి పేరిట జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మ్యుటేషన్ చేయాలి. దీనికోసం మీ సేవ ద్వారా మ్యుటేషన్ దరఖాస్తులు స్వీకరించి, స్లాట్లు కేటాయించాలి.
  • సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను కలెక్టర్లు పరిశీలించి యాజమాన్య హక్కులను ఖరారు చేయాలి. క్రమబద్దీకరించిన సాదాబైనామాల ప్రకారం భూముల వివరాలను ధరణిలో నమోదు చేయాలి. పట్టాదారు పాస్ బుక్కులు ఇవ్వాలి.
  • కోర్టుల విచారణలో ఉన్నవి మినహా, భూ రికార్డుల సమగ్ర సర్వే సందర్భంగా పార్ట్–బి లో పెట్టిన వ్యవసాయ భూములకు సంబంధించిన అంశాలన్నింటినీ కలెక్టర్లు 60 రోజుల్లో పరిష్కరించాలి. అవసరమైన సందర్భాల్లో కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి నిర్ణయాలు తీసుకోవాలి. యాజమాన్య హక్కులను ఖరారు చేయాలి.
  • రెవెన్యూ కోర్టుల్లోని వివాదాలను పరిష్కరించడానికి జిల్లాకొకటి చొప్పున కలెక్టర్ల ఆధ్వర్యంలో ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలి.
  • సరిహద్దు వివాదాలున్న చోట జిల్లా కలెక్టర్లు సర్వే నిర్వహించి, హద్దులు నిర్ణయించాలి.
    1/70 చట్టం అమలులో లేని ప్రాంతాల్లో ఆ చట్టం కింద నమోదైన కేసులను పరిష్కరించాలి. 1/70 చట్టం అమలులో ఉన్న ప్రాంతాల్లో భూములపై ఆ ప్రాంత ఎస్టీల హక్కులు కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలి.
  • సేత్వార్ వ్యత్యాసాలపై కలెక్టర్లు విచారణ జరిపి, తుది నిర్ణయం తీసుకోవాలి. ఆ వివరాలను ధరణిలో నమోదు చేసి, పాసు బుక్కులు ఇవ్వాలి.
  • కొన్ని చోట్ల ఒకే సర్వే నెంబరులో ప్రభుత్వ, ప్రైవేటు భూములున్నాయి. ఆ సర్వే నెంబరును నిషేధిత జాబితా (22/ఎ) లో పెట్టారు. అలా పెట్టిన చోట్ల కలెక్టర్లు విచారణ జరిపి, ఏది ప్రభుత్వ భూమలో, ఏది ప్రైవేటు భూమో నిర్ణయించాలి. అర్హుల వివరాలను ధరణిలో చేర్చి, పాస్ పుస్తకాలు ఇవ్వాలి.
  • కోర్టుల ద్వారా, కలెక్టర్ల ఆధ్వర్యంలోని ట్రిబ్యునళ్ల ద్వారా వచ్చిన అధికారిక తీర్పుల ప్రకారం ధరణిలో భూములకు సంబంధించిన వివరాల్లో మార్పులు, చేర్పులు చేపట్టాలి. కోర్టు పోర్టల్ ను ధరణిలో చేర్చాలి.
  • ధరణి పోర్టల్ ద్వారా లీజ్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాటు కల్పించాలి.
  • నాలా ద్వారా కన్వర్ట్ అయిన భూముల వివరాలను ధరణిలో నమోదు చేసి, వాటికి ప్రొసీడింగ్స్ ఇవ్వాలి.
  • అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జిపిఏ చేసుకోవడానికి ధరణి పోర్టల్ ద్వారా అవకాశం ఇవ్వాలి.
  • వ్యవసాయ భూమల లీజు డీడ్, ఎక్ఛేంజ్ డీడ్ ల రిజిస్ట్రేషన్లకు ధరణిలో అవకాశం కల్పించాలి.
  • వ్యవసాయ భూముల్లో నెలకొల్పే ఫర్ములు, కంపెనీలు, వివిధ సంస్థలు ఆ భూములు అమ్ముకునేందుకు, కొనుక్కునేందుకు ధరణిలో తక్షణం అవకాశం కల్పించాలి.
  • పాస్ పోర్టు నెంబరు నమోదు చేసుకుని ఎన్.ఆర్.ఐ.ల భూములు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కల్పించాలి.
  • ఇ.సి, మార్కెట్ వ్యాల్యూ సర్టిఫికెట్లను ఆన్ లైన్ లో ప్రింట్ తీసుకునే అవకాశం కల్పించాలి.
  • ఏదైనా అనివార్య కారణాల వల్ల స్లాట్ బుక్ చేసుకున్న రోజు రాలేకపోయే వారికి స్లాట్ రద్దు చేసుకోవడానికి, మరో రోజు బుక్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. స్లాట్ క్యాన్సిల్ చేసుకున్నచో డబ్బులు తిరిగి ఇవ్వాలి.
  • స్లాట్ బుక్ చేసుకునే సందర్భంగా వివరాలు తప్పుగా నమోదైతే, స్లాట్ బుక్ చేసుకున్న చోటే వాటిని సవరించుకునేందుకు రిజిస్ట్రేషన్ కన్నా ముందు అవకాశం కల్పించాలి.
  • చట్టబద్ధ వారసుల పేర్లను రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో అనుమతిదారుల (కన్సెంటింగ్ పార్టీ) కేటగిరీ కింద నమోదు చేసుకునే ఆప్షన్ కల్పించాలి.
  • మైనర్ల పేరిట భూములు రిజిస్ట్రేషన్ చేసే సందర్భంలో మైనర్లు మరియు సంరక్షుల పేర పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలి.
  • ప్రభుత్వం అసైన్ చేసిన భూములు అనుభవిస్తున్న రైతులు మరణిస్తే, వారి చట్టబద్ధ వారసులకు ఆ భూములను బదలాయించాలి.
  • పట్టాదార్ పాసుబుక్కులు పోయినట్లయితే, వాటి స్థానంలో ట్రూ కాపీ తీసుకునే అవకాశం కల్పించాలి.
  • ప్రభుత్వ భూములు, చెరువు ఎఫ్.టి.ఎల్. భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు, అటవీ భూములను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తులకు రిజిస్టర్ చేయవద్దు.
  • ఇనామ్ భూములను సాగు చేసుకుంటున్న హక్కు దారులకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇచ్చి, ఆ వివరాలను ధరణిలో నమోదు చేయాలి.
  • ధరణిలో స్లాట్ బుక్ కాకపోతే, ఎందుకు కావడం లేదనే విషయం దరఖాస్తు దారుడికి తెలిపే ఆప్షన్ ధరణిలో ఉండాలి.

పైన పేర్కొన్న మార్పులు, చేర్పులు చేపడితే ధరణి పోర్టల్ ద్వారా మరింత సమర్థవంతంగా భూముల రిజిస్ట్రేషన్ చేయడం సాధ్యమవుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ సమీక్షలో మంత్రులు కెటి రామారావు, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సిఎంవో ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, శేషాద్రి, కార్యదర్శి స్మితా సభర్వాల్, మీ సేవ సిఇవో వెంకటేశ్వర్ రావు, రెవెన్యూ వ్యవహారాల నిపుణులైన రిటైర్డ్ ఐఎఎస్ అధికారులు రామయ్య, సుందర్ అబ్నార్, రఫత్ అలీ, కలెక్టర్లు వెంకట్రాం రెడ్డి, హనుమంతరావు, ప్రశాంత్ పాటిల్, నారాయణరెడ్డి, శశాంక్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, మర్రి జనార్థన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + nineteen =