కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు.. టీఆర్ఎస్

Kalvakuntla Kavitha Launches New Political Party Named Telangana Rashtra Sena

తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనయ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ వేదికను ప్రకటించారు. ఈ మేరకు నేడు (శనివారం, ఏప్రిల్ 25, 2026) నాడు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె తన కొత్త పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS)గా అధికారికంగా ప్రకటించారు.

పార్టీ ఆవిర్భావం – కీలక ప్రకటనలు

గతంలో బీఆర్ఎస్ పార్టీ నుండి బహిష్కరణకు గురైన తర్వాత, కవిత తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వచ్చారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి భారీ కార్యకర్తల ర్యాలీతో మునీరాబాద్ చేరుకున్న ఆమె, అక్కడ ఏర్పాటు చేసిన సభలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె కీలక ప్రసంగం చేశారు. ‘సర్వోదయ తెలంగాణ’ (అందరి సంక్షేమం) లక్ష్యంగా ఈ పార్టీ పనిచేస్తుందని, ఇది పూర్తిగా తెలంగాణ గడ్డపై పుట్టిన సొంత పార్టీ అని పేర్కొన్నారు.

  • పార్టీ లక్ష్యం: లక్ష్యం: ఉచిత విద్య, ఉచిత వైద్యం తొలి ప్రాధాన్యం. ‘రైతే రాజు’ అనే నినాదాన్ని నిజం చేసే దిశగా వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం.

  • శత్రువు ఎవరంటే?: తన ప్రధాన పోరాటం కాంగ్రెస్ పార్టీతోనేనని, ప్రజల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

  • పోటీ ఎక్కడ?: రాబోయే ఎన్నికల్లో తాను సిద్దిపేట లేదా బోధన్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ఆమె సంకేతాలిచ్చారు. ముఖ్యంగా సిద్దిపేటలో మహిళా రిజర్వేషన్లు అమలైతే అక్కడి నుంచే పోటీ చేస్తానని తెలిపారు.

  • ఖచ్చితంగా ముఖ్యమంత్రిని అవుతా: తెలంగాణ రాష్ట్రానికి ఖచ్చితంగా తాను ముఖ్యమంత్రిని అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు కవిత. వచ్చే ఎన్నికల్లో గెలిచి తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, అప్పటివరకు బలమైన ప్రతిపక్షంగా ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని కవిత పేర్కొన్నారు.

బీఆర్ఎస్‌తో తెగతెంపులు – నేపథ్యం

గత ఏడాది సెప్టెంబర్ 3న కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి క్రమశిక్షణారాహిత్యం నెపంతో బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే తన సోదరుడు కేటీఆర్ మరియు కజిన్స్ హరీష్ రావు, సంతోష్ రావులపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి కేసీఆర్ చుట్టూ ఉన్నవారు కుటుంబంలో చిచ్చు పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం బీఆర్ఎస్ ‘స్లీపింగ్ మోడ్’లో ఉందని విమర్శిస్తూ, తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చడానికి ‘తెలంగాణ రాష్ట్ర సేన’ ఒక దిక్సూచిలా మారుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి వస్తే, కవిత వంటి మహిళా నేతలకు రాజకీయంగా మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉంది.

విశ్లేషణ

కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని స్థాపించడం వల్ల తెలంగాణలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారనున్నాయి. గతంలో కేసీఆర్ ప్రారంభించిన టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పేరును పోలినట్లుగా ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పేరును ఎంచుకోవడం వెనుక సెంటిమెంట్ రాజకీయాలను వాడుకునే వ్యూహం కనిపిస్తోంది. ఇది బీఆర్ఎస్ కేడర్‌లో చీలికకు దారితీయడమే కాకుండా, అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ మహిళా నేతగా ఆమె ఏ మేరకు ప్రజలను ఆకట్టుకుంటారనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here