కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్లు మరోసారి సంచలన ప్రదర్శనతో మెరిసారు. అథ్లెటిక్స్ మరియు జూడో విభాగాల్లో భారత్‌కు పతకాల పంట పండింది. జూడో పోటీలలో భారత క్రీడాకారులు రికార్డు స్థాయిలో రెండు స్వర్ణాలు, ఒక రజత పతకం కైవసం చేసుకుని చరిత్ర సృష్టించగా.. పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రజత పతకం, యశ్వీర్ సింగ్ కాంస్య పతకం సాధించి చారిత్రాత్మక విజయాన్ని అందించారు.
జూడోలో సువర్ణాధ్యాయం: ఒకే రోజు రెండు పశ్చిడి పతకాలు
జూడో పోటీల్లో భారత క్రీడాకారులు అసాధారణ ప్రదర్శనతో కొత్త చరిత్ర లిఖించారు. కామన్వెల్త్ గేమ్స్ జూడో చరిత్రలో ఇప్పటివరకు భారత్‌కు ఒక్క పసిడి పతకం కూడా లభించకపోగా, ఈసారి ఒకే రోజు రెండు స్వర్ణాలు, ఒక రజతం సొంతమయ్యాయి.
-
అస్మితా దే (మహిళల 48 కేజీలు): ఫైనల్‌లో కెనడాకు చెందిన హెయిడీ క్వాచ్‌ను ‘గోల్డెన్ స్కోర్’ పద్ధతిలో ఓడించి, కామన్వెల్త్ జూడోలో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా అస్మిత చరిత్ర సృష్టించారు.
-
హర్ష్ సింగ్ (పురుషుల 60 కేజీలు): ఆస్ట్రేలియాకు చెందిన ఒలింపియన్ జాషువా కాట్జ్‌ను 10-0 తేడాతో చిత్తు చేసి భారత్‌కు రెండో స్వర్ణ పతకాన్ని అందించారు.
-
యామిని మోర్య (మహిళల 57 కేజీలు): ఇంగ్లండ్‌కు చెందిన అసిల్యా తోప్రాక్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు.
జావెలిన్ త్రోలో చరిత్ర: ఒకేసారి రెండు పతకాలు
పురుషుల జావెలిన్ త్రో విభాగంలో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా తన రెండో ప్రయత్నంలో ఈ సీజన్ బెస్ట్ ప్రదర్శనగా 85.83 మీటర్ల దూరం విసిరి రజత పతకంతో నిలిచాడు. శ్రీలంక స్టార్ రమేశ్ పతిరగె 89.75 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. కాగా, తొలిసారి కామన్వెల్త్ గేమ్స్‌లో అడుగుపెట్టిన 24 ఏళ్ల భారత యువ అథ్లెట్ యశ్వీర్ సింగ్ చివరి ప్రయత్నంలో తన కెరీర్ బెస్ట్ 85.41 మీటర్ల త్రోతో ఏడో స్థానం నుంచి ఒక్కసారిగా మూడో స్థానానికి ఎగబాకి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
ఒకే విభాగంలో ఇద్దరు భారత అథ్లెట్లు పతకాల వేదికపై నిలవడం అంతర్జాతీయ క్రీడారంగంలో భారత్ ఆధిపత్యానికి నిదర్శనంగా నిలిచింది. పోటీల్లో పాల్గొన్న మరో భారత అథ్లెట్ రోహిత్ యాదవ్ 81.56 మీటర్లతో ఏడో స్థానంలో నిలిచాడు.
ట్రాక్ అండ్ ఫీల్డ్‌తో పాటు మార్షల్ ఆర్ట్స్ విభాగమైన జూడోలో కూడా భారత్ ప్రపంచ స్థాయిలో రికార్డు స్థాయి ప్రదర్శన చేయడం భారత క్రీడారంగానికి నూతన ఉత్తేజాన్ని ఇచ్చిందని క్రీడా విశ్లేషకులు కొనియాడుతున్నారు. ఈ విజయాలు భవిష్యత్తులో మరింత మంది యువ అథ్లెట్లకు ఆదర్శంగా నిలుస్తాయని అభిప్రాయపడుతున్నారు.






































