కేసీఆర్‌ ఆదాయం వచ్చే శాఖలను ఉంచుకుంటే.. నేను రోజూ తిట్లు తినే విద్యాశాఖ తీసుకున్నా – సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Defends Holding Education Portfolio, Targets BRS Chief KCR

తెలంగాణలో ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థను నిర్మించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఉచిత అల్పాహారం, పారదర్శక ఉపాధ్యాయ నియామకాలు, ఐటీఐలను అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లుగా (ATCs) అభివృద్ధి చేయడం, స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు వంటి కీలక సంస్కరణలను ఇప్పటికే అమలు చేస్తున్నామని తెలిపారు.

విద్యాశాఖను ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతోనే ఆ శాఖను తన వద్దే ఉంచుకున్నానని పేర్కొంటూ, 2034 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతానని మరోసారి ధీమా వ్యక్తం చేశారు. జర్మనీ, ఫిన్లాండ్ దేశాల్లో విద్యా విధానాలను అధ్యయనం చేసి వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

విద్యాశాఖ నా దగ్గరే.. కేసీఆర్‌పై విమర్శలు

విద్యా రంగంలో సంస్కరణలు తీసుకురావాలంటే ప్రత్యక్ష పర్యవేక్షణ అవసరమని భావించి విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్నానని సీఎం తెలిపారు. రోజూ విమర్శలు ఎదుర్కొనే శాఖను తాను బాధ్యతగా నిర్వహిస్తున్నానని, తాను విద్యాశాఖ మంత్రిగా పాస్ అయ్యానా, ఫెయిల్ అయ్యానా అన్నది ఉపాధ్యాయులే నిర్ణయించాలని వ్యాఖ్యానించారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పిస్తూ, ఆయనకు సంపాదనే ప్రధాన లక్ష్యమని, అందుకే ఆర్థిక, రెవెన్యూ శాఖలను తన వద్దే ఉంచుకున్నారని ఆరోపించారు.

నైపుణ్యాల కొరతపై ఆందోళన.. ప్రపంచ స్థాయి శిక్షణకు ప్రణాళిక

రాష్ట్రంలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అనేక మంది యువత కనీస ఉద్యోగ దరఖాస్తు కూడా సరిగా రాయలేకపోతున్నారని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఇది విద్యార్థుల వైఫల్యం కాదని, వారికి సరైన నైపుణ్యాలు అందించలేకపోయిన విద్యా వ్యవస్థ లోపమని పేర్కొన్నారు.

ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుతున్న 24 వేల మంది విద్యార్థులకు ప్రత్యేక స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. అలాగే భవిష్యత్తులో ప్రతి ఏడాది ఎంపిక చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులను హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వ ఖర్చుతో శిక్షణ కోసం పంపనున్నట్లు వెల్లడించారు.

విద్యతో పాటు సంక్షేమ పథకాలపై దృష్టి

విద్యా రంగంలో చేపడుతున్న ఈ సంస్కరణలు తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలబెడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థిపై ఏటా రూ.1.08 లక్షలు ఖర్చు చేస్తున్నామని సీఎం తెలిపారు. నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతి మండలాన్ని యూనిట్‌గా తీసుకుని డిసెంబర్ నాటికి సమగ్ర విద్యా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

అదే సమయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, రైతు సంక్షేమం, ఉచిత బస్సు ప్రయాణం, రుణమాఫీ వంటి పథకాలపై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించేందుకు పీఆర్‌వోలు, సోషల్ మీడియా కో-ఆర్డినేటర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here