తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న అమీర్‌పేట మైత్రీవనం కూడలిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 23 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని గురువారం ఘనంగా ఆవిష్కరించారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించడం తన జీవితకాలంలో గుర్తుండిపోయే ఒక అద్భుతమైన జ్ఞాపకమని ఆయన కొనియాడారు.
గతంలో జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో మైత్రీవనం జంక్షన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం గమనార్హం. ఈ విగ్రహ స్థాపన ప్రక్రియను స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ దగ్గుండి పర్యవేక్షించారు.
కులమతాలకు, ప్రాంతాలకు అతీతమైన మహానాయకుడు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కేవలం ఒక ప్రాంతానికో, కులానికో లేదా మతానికో పరిమితమైన నాయకుడు కాదని, దేశం గర్వించదగ్గ గొప్ప మహానీయుడని కొనియాడారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయి ఉండి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎలా ఆవిష్కరిస్తారంటూ కొందరు చేస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు.
ఎన్టీఆర్ విగ్రహం కేవలం ఒక కట్టడం మాత్రమే కాదని, రాజకీయాలకు అతీతంగా సమాజానికి దిశానిర్దేశం చేసే ఒక గొప్ప స్ఫూర్తి కేంద్రమని స్పష్టం చేశారు. భారత చరిత్రలో స్ఫూర్తినిచ్చే నాయకులను స్మరించుకోవాల్సి వస్తే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, ఇందిరా గాంధీలతో పాటు ఎన్టీఆర్ పేరు కూడా శాశ్వతంగా నిలిచిపోతుందని ప్రశంసించారు.
అన్నగారి స్ఫూర్తితోనే ప్రజా పాలన
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఇందిరమ్మ ఆశీస్సులు, ఎన్టీఆర్ ఆశయాల కలయికతోనే సాగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నాడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం స్ఫూర్తితోనే నేడు తమ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ పథకాన్ని కొనసాగిస్తోందని గుర్తుచేశారు. మహిళలకు చీరల పంపిణీ, స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ల అమలు, బలహీన వర్గాలకు రాజకీయ గుర్తింపు ఇవ్వడం వంటి విప్లవాత్మక మార్పులకు ఎన్టీఆరే ఆద్యుడన్నారు.
ముఖ్యంగా తెలంగాణలో పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించేలా పటేల్-పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఘనత ఎన్టీఆర్‌దేనని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ వంటి ఎందరో నాయకులను రాజకీయంగా ప్రోత్సహించింది ఎన్టీఆరేనని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు.
హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగానే 30 వేల ఎకరాల్లో ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ విగ్రహావిష్కరణ మహోత్సవంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నందమూరి కుటుంబ సభ్యులు మరియు భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.





































