ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో శుక్రవారం బోధి పెవిలియన్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ‘క్యూర్’ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్లతో కలిసి ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. నిరుపేదలకు కేటాయించే ఇళ్లు జనావాసాలకు, వారి పని ప్రదేశాలకు సమీపంలోనే ఉండాలని, అప్పుడే వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని స్పష్టం చేశారు.
పని ప్రదేశాలకు దగ్గరగానే ఇందిరమ్మ ఫ్లాట్లు
జనావాసాలకు దూరంగా ఇళ్లను కేటాయిస్తే లబ్ధిదారులు జీవనోపాధి కోల్పోవడంతో పాటు ఆ ఇళ్లు నిరుపయోగంగా మారే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అందువల్ల ఔటర్ రింగ్ రోడ్డు (ORR) లోపల వివిధ ప్రభుత్వ శాఖల్లో నిరుపయోగంగా ఉన్న స్థలాలను తక్షణమే గుర్తించాలని అధికారులను ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖలకు సంబంధించిన అనువైన భూములను హౌసింగ్ అవసరాల కోసం సేకరించి, ఆయా శాఖలకు వేరే చోట ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయించాలని సూచించారు.
రూ.5 లక్షల భారీ సబ్సిడీ.. 17 నియోజకవర్గాల్లో తొలి విడత
క్యూర్ పరిధిలోని ప్రతి ఫ్లాట్‌ను దాదాపు 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో (400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా) నిర్మించనున్నారు. ఒక్కో ఫ్లాట్ నిర్మాణానికి దాదాపు రూ.11 లక్షలు ఖర్చవుతుండగా, అందులో రూ.5 లక్షల భారీ సబ్సిడీని ప్రభుత్వమే అందిస్తోంది. మిగిలిన రూ.6 లక్షలు లబ్ధిదారుడి వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. స్థలం విలువను పూర్తిస్థాయిలో ప్రభుత్వమే భరిస్తుంది.
తొలిదశలో రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజిగిరి, నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కార్వాన్, బహదూర్‌పుర, అంబర్‌పేట, కూకట్పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, సనత్‌నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మలక్‌పేట వంటి 17 నియోజకవర్గాల పరిధిలో 7,680 ఫ్లాట్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్, ప్రభుత్వ ఉన్నతాధికారులు వికాస్‌రాజ్, అహ్మద్ నదీమ్, ఎన్.శ్రీధర్, వి.శేషాద్రి, లోకేష్‌కుమార్, సర్ఫరాజ్ అహ్మద్, వీపీ గౌతమ్, ప్రియాంక ఆల తదితరులు పాల్గొన్నారు. పేదలకు అత్యంత విలువైన ప్రాంతాల్లో సొంత ఇంటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.






































