తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్లోబరీనా టెక్నాలజీస్ వ్యవహారంలో చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం రేవంత్ రెడ్డి నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తూ తన పరువుకు భంగం కలిగించారని మండిపడ్డారు. తనకు 48 గంటల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపారు.
48 గంటల్లో క్షమాపణ చెప్పాలి – లై డిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధం
గ్లోబరీనా టెక్నాలజీస్ సంస్థతో తనకు ఎలాంటి ఆర్థిక, యాజమాన్య లేదా కుటుంబ సంబంధాలు లేవని కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన ఆరోపణలను 48 గంటల్లోగా ఆధారాలతో నిరూపించాలని, లేదంటే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని సవాల్ విసిరారు. గ్లోబరీనా వ్యవహారంపై సిఐడి, సిట్ విచారణలకే కాకుండా లై డిటెక్టర్ (అబద్ధాల నిర్ధారణ) పరీక్షకైనా తాను సిద్ధంగా ఉన్నానని, సీఎం కూడా తన కుటుంబ అవినీతి ఆరోపణలపై విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. గడువులోగా క్షమాపణలు చెప్పకపోతే తీవ్రమైన సివిల్, క్రిమినల్ మరియు పరువు నష్టం దావాలు వేస్తామని హెచ్చరించారు.
భాజపాతో రాజీ – డ్రామాలు కట్టిపెట్టాలి
మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం లేకనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ విజిట్ మళ్లించి కొడంగల్‌లో ధర్నా చేశారని విమర్శించారు. పాత కేసుల భయం, సింగరేణి బొగ్గు కుంభకోణం, అమృత్ టెండర్ల వ్యవహారం నుంచి బయటపడటానికే రేవంత్ రెడ్డి భాజపాతో రాజీపడ్డారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే గ్లోబరీనా సంస్థతో ఒప్పందాలు చేసుకుని, ఇప్పుడు అది తన బినామీ అనడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.
ఇప్పటికే నీట్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమవుతున్న వేళ.. ఇప్పుడు తెలంగాణలో గ్లోబరీనా వివాదం మరింత వేడిని రగిల్చింది. తొలుత సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు, దానిపై కేటీఆర్ లీగల్ నోటీసులతో పాటు లై డిటెక్టర్ టెస్ట్ సవాల్ విసిరిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.





































