2029 ఎన్నికల్లో పోటీకి ఆడబిడ్డలు ఇప్పటినుండే సిద్ధం కావాలి – మహానాడులో సీఎం చంద్రబాబు

CM Chandrababu Confirms TDP Will Give 33% Women Seat Reservation For 2029 Elections

2029 ఎన్నికల్లో టీడీపీ మహిళలకు 33% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలుచేస్తుందని, అందులో ఎలాంటి సందేహం అవసరం లేదని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన  మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ‘మహానాడు-2026’ రెండవ రోజు డిజిటల్ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. అందుకోసం ఎన్నికల్లో పోటీకి ఆడబిడ్డలు ఇప్పటినుండే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ కేడర్‌ను సాంకేతికంగా మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగానే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సరికొత్తగా ‘డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్’ (డిజిటల్ కేడర్) వ్యవస్థను తీసుకువస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి నలుగురు చొప్పున సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే యువతను డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్లుగా ఎంపిక చేసి, వారికి పార్టీ తరఫున ప్రత్యేక గుర్తింపు కార్డులు అందజేస్తామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను మరియు అభివృద్ధి కార్యక్రమాలను ఈ డిజిటల్ సైన్యం ద్వారా క్షేత్రస్థాయిలోకి సమర్థవంతంగా తీసుకెళ్తామని వివరించారు.

2029 సీట్ల కేటాయింపుపై స్పష్టత.. స్త్రీశక్తికి పెద్దపీట

మహానాడు వేదికగా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ ప్రతిపాదించిన మహిళా రిజర్వేషన్ తీర్మానానికి సీఎం చంద్రబాబు నాయుడు పూర్తి మద్దతు ప్రకటించారు. పార్లమెంటులో మహిళా బిల్లు పాస్ అయినా, కాకపోయినా.. టీడీపీ విధానం ప్రకారం రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల్లో 33 శాతం సీట్లను కచ్చితంగా మహిళలకే కేటాయిస్తామని పునరుద్ఘాటించారు.

నాడు ఎన్టీఆర్ ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించి స్త్రీశక్తికి ప్రాధాన్యం ఇచ్చారని, నేడు తమ ప్రభుత్వం చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచడం ద్వారా వారిని నిజమైన విధాన నిర్ణేతలుగా మార్చడానికి కట్టుబడి ఉందన్నారు. పార్టీ కోసం రాత్రింబగళ్లు కష్టపడే సాధారణ కార్యకర్తలకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, నిబద్ధత గల నాయకులను గ్రామస్థాయి నుంచి నేరుగా పొలిట్‌బ్యూరో వరకు తీసుకువస్తామని కేడర్‌లో భరోసా నింపారు.

అక్రమ ఆస్తుల సంపాదన కోసమే జగన్ ఆరాటం

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తోందని, నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సీ ప్రక్రియను కూడా పారదర్శకంగా నిర్వహిస్తోందని గుర్తుచేశారు. గత వైకాపా ప్రభుత్వ ఐదేళ్ల హయాంలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి కేవలం తన అక్రమ ఆస్తుల సంపాదన కోసమే నిరంతరం ఆరాటపడ్డారని సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

“గత ప్రభుత్వ విధ్వంసం వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది. జగన్ మోహన్ రెడ్డి కేవలం తన ప్యాలెస్‌ల నిర్మాణం, బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లిలో లగ్జరీ ఇళ్లను ఏర్పరచుకోవడంపైనే శ్రద్ధ పెట్టారు తప్ప రాష్ట్ర ప్రజల బాగును పూర్తిగా విస్మరించారు” అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here