ఐపీఎల్-19వ సీజన్ క్లైమాక్స్ రసవత్తరంగా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో ఫైనల్ పోరులో తలపడే రన్నరప్ జట్టు ఏదో తేలిపోయింది. శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను మట్టికరిపించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెరుపు శతకంతో చెలరేగగా, రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పోరాటం వృథా అయింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ చరిత్రలో మూడోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న గ్రాండ్ ఫైనల్లో టైటిల్ కోసం ఆర్సీబీతో గుజరాత్ తలపడనుంది.
టాప్ ఆర్డర్ విధ్వంసం.. వన్-సైడ్ చేసిన గిల్, సుదర్శన్
రాజస్థాన్ నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ ఓపెనర్లు తొలి ఓవర్ నుంచే ఉప్పెనలా విరుచుకుపడ్డారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ ఎదురుదాడికి రాజస్థాన్ బౌలర్లు చేతులెత్తేశారు. వీరి ధాటికి తొలి ఓవర్లోనే 19 పరుగులు రాగా, పవర్‌ప్లే ముగిసేసరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన సాయి సుదర్శన్ (32 బంతుల్లో 58).. 13వ ఓవర్లో దురదృష్టవశాత్తూ హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. ఇలా అవుటవడం అతనికిది వరుసగా రెండోసారి కావడం గమనార్హం. దీంతో తొలి వికెట్‌కు నమోదైన 167 పరుగుల భారీ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.
మరోవైపు క్లాస్ ఇన్నింగ్స్ ఆడిన శుభ్‌మన్ గిల్ కేవలం 47 బంతుల్లోనే ఫోర్‌తో తన సెంచరీ మార్కును అందుకున్నాడు. మొత్తంగా 53 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 104 పరుగులు చేసిన గిల్‌ను జోఫ్రా ఆర్చర్ ఎల్బీగా అవుట్ చేశాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ (16) త్వరగానే అవుటైనా.. రాహుల్ తెవాటియా (17 నాటౌట్), జోస్ బట్లర్ (9 నాటౌట్) కలిసి 18.4 ఓవర్లలోనే 219/3 స్కోరుతో గుజరాత్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించారు. అద్భుత శతకంతో మ్యాచ్‌ను మలుపు తిప్పిన గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
తడబడి నిలిచిన రాజస్థాన్.. మరోసారి సెంచరీ చేజార్చుకున్న వైభవ్
అంతకుముందు టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే గుజరాత్ పేసర్లు మహ్మద్ సిరాజ్, కగిసో రబాడ చెలరేగడంతో.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (1), ధ్రువ్ జురెల్ (7) త్వరగానే అవుట్ కావడంతో రాజస్థాన్ 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో వన్ డౌన్‌గా వచ్చిన రవీంద్ర జడేజాతో కలిసి ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు.
ప్రసిద్ధ్ కృష్ణ ఓవర్లో జడేజా బౌండరీల వర్షం కురిపించడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 70/2కు చేరింది. కానీ, 8వ ఓవర్ ముగిశాక జడేజా మోచేతి గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ (11), దసన్ శనక (3), జోఫ్రా ఆర్చర్ (7)లను హోల్డర్, రబాడ అవుట్ చేయడంతో రాజస్థాన్ వికెట్లు కోల్పోయింది.
మరో ఎండ్‌లో ఒంటరి పోరాటం చేసిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. గాయం నుంచి కోలుకుని తిరిగి క్రీజులోకి వచ్చిన జడేజాతో కలిసి వైభవ్ గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఒక దశలో వరుస సిక్సర్లు బాదుతూ బ్యాక్-టు-బ్యాక్ సెంచరీ వైపు దూసుకెళ్లిన వైభవ్.. కేవలం 4 పరుగుల దూరంలో (47 బంతుల్లో 96; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) రబాడ బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో జడేజాతో కూడిన 127 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
ఆఖరి ఓవర్లో డోనవన్ ఫెరీరా కేవలం 11 బంతుల్లో 4 సిక్సర్లతో 38 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, జడేజా 45 పరుగులతో అజేయంగా నిలిచాడు. రషీద్ ఖాన్ వేసిన చివరి ఓవర్లో ఫెరీరా 4 సిక్సర్లతో 27 పరుగులు పిండుకోవడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది. గుజరాత్ బౌలర్లలో జేసన్ హోల్డర్, కగిసో రబాడ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
సరికొత్త రికార్డులు
కాగా, ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం (167) నమోదు చేసిన జోడీగా గిల్-సాయి సుదర్శన్ సరికొత్త రికార్డ్ నెలకొల్పారు. అలాగే, ఐపీఎల్లో 90+స్కోరుపై ఒకే సీజన్లో ఎక్కువసార్లు (3) అవుటైన బ్యాటర్‌గా వైభవ్ (2026) నిలవగా, అంతకుముందు ఈ జాబితాలో మ్యాక్స్‌వెల్ (2014) కూడా ఉన్నాడు.
స్కోరుబోర్డు
రాజస్థాన్ బ్యాటింగ్: జైస్వాల్ (సి) ప్రసిద్ధ్ (బి) సిరాజ్ 1, వైభవ్ సూర్యవంశీ (సి) ప్రసిద్ధ్ (బి) రబాడ 96, జురెల్ (సి) గిల్ (బి) రబాడ 7, జడేజా (నాటౌట్) 45, పరాగ్ (సి) రబాడ (బి) హోల్డర్ 11, షనక (సి) బట్లర్ (బి) హోల్డర్ 3, ఆర్చర్ (సి) బట్లర్ (బి) ప్రసిద్ధ్ 7, ఫెరీరా (నాటౌట్) 38, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 20 ఓవర్లలో 214/6.
వికెట్ల పతనం: 1-2, 2-9, 3-101, 4-109, 5-118, 6-172.
బౌలింగ్: సిరాజ్ 4-0-42-1, రబాడ 4-0-35-2, ప్రసిద్ధ్ 4-0-42-1, వాషింగ్టన్ 2-0-23-0, హోల్డర్ 4-0-27-2, రషీద్ 2-0-45-0.
గుజరాత్ బ్యాటింగ్: సాయి సుదర్శన్ (హిట్ వికెట్) (బి) బ్రిజేశ్ 58, గిల్ (ఎల్బీ) ఆర్చర్ 104, బట్లర్ (నాటౌట్) 9, వాషింగ్టన్ (సి) ఫెరీరా (బి) బర్గర్ 16, తెవాటియా (నాటౌట్) 17, ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 18.4 ఓవర్లలో 219/3.
వికెట్ల పతనం: 1-167, 2-182, 3-201.
బౌలింగ్: ఆర్చర్ 4-0-45-1, బర్గర్ 4-0-35-1, బ్రిజేశ్ 3.4-0-44-1, తుషార్ 3-0-34-0, యశ్‌రాజ్ 2-0-29-0, జడేజా 2-0-28-0.






































