ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగంలో ఒక చారిత్రాత్మక మార్పు చోటుచేసుకోనుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో జిఎంఆర్ ಸಂಸ್ಥ సంస్థా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆగస్టు 17వ తేదీ అర్ధరాత్రి 00:01 గంటల నుంచి పూర్తిస్థాయి షెడ్యూల్డ్ కమర్షియల్ విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి.
ఈ నేపథ్యంలో దాదాపు 30 ఏళ్ల పాటు సేవలు అందించిన విశాఖపట్నం విమానాశ్రయం (INS డేగా – సివిల్ ఎన్‌క్లేవ్) నుంచి సాధారణ షెడ్యూల్డ్ కమర్షియల్ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
‘VTZ’ కోడ్ బదిలీ.. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో అందుబాటులో ఉండే సేవలు
ఆగస్టు 17 నుంచి విశాఖపట్నం విమానాశ్రయానికి ఉన్న అంతర్జాతీయ ట్రావెల్ కోడ్ ‘VTZ’ భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ కానుంది. ఒప్పందం ప్రకారం రాబోయే 30 ఏళ్ల పాటు విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి ఎటువంటి షెడ్యూల్డ్ వాణిజ్య విమానాలు నడవవు. అయితే విశాఖ ఎయిర్‌పోర్ట్ పూర్తిగా మూతపడదు.
జాతీయ అత్యవసర పరిస్థితులతో పాటు భారతీయ వైమానిక దళం, సాయుధ దళాలు, పోలీసు విమానాలు, ప్రభుత్వ అతిథుల కోసం వినియోగించే ప్రత్యేక ఎయిర్‌క్రాఫ్ట్‌ల రాకపోకలు కొనసాగుతాయి. అలాగే నాన్-షెడ్యూల్డ్ వాణిజ్య మరియు చార్టర్డ్ విమానాల కార్యకలాపాలకు విశాఖలో అనుమతి ఉంటుంది.
గెజిట్ నోటిఫికేషన్ – ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ఊపు
భోగాపురం విమానాశ్రయానికి మన్యం వీరుడు ‘అల్లూరి సీతారామరాజు’ పేరును ఖరారు చేస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రపంచస్థాయి రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
జీఎంఆర్ సంస్థ పిపిపి (PPP) విధానంలో అత్యంత ఆధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఆర్థిక, పర్యాటక రంగాలు మరింత పురోగతి సాధించనున్నాయి.









































