తెలంగాణలో మోగిన బడిగంట.. బ్రేక్‌ఫాస్ట్‌ పథకం ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

Telangana Schools Reopen Today, Minister Ponnam Prabhakar Launches Breakfast Scheme

వేసవి సెలవుల అనంతరం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు సోమవారం ఘనంగా పునఃప్రారంభమయ్యాయి. కొత్త పుస్తకాలు, సరికొత్త ఏకరూప దుస్తులతో బడిబాట పట్టిన చిన్నారులతో పాఠశాలల ప్రాంగణాలు మళ్లీ సందడిగా మారాయి. సుదీర్ఘ సెలవుల తర్వాత బడికి వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. నూతన విద్యా సంవత్సరం తొలి రోజే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలను విద్యాశాఖ అధికారులు పంపిణీ చేశారు.

ఇక ఈ నేపథ్యంలో.. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నూతనంగా అల్పాహారాన్ని అందించే ప్రతిష్టాత్మక పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఇన్-ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ బ్రేక్‌ఫాస్ట్‌, మిల్క్ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలనే సంకల్పంతోనే ఈ వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ (12వ తరగతి) వరకు చదువుతున్న సుమారు 29 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించడం, బడిలో హాజరు శాతాన్ని పెంచడం మరియు ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రభుత్వం ఏటా దాదాపు రూ. 720 కోట్ల నుంచి రూ. 800 కోట్ల వరకు భారీ బడ్జెట్‌ను కేటాయించింది.

ఈ సరికొత్త మెనూ ప్రకారం విద్యార్థులకు వారంలో 6 రోజుల పాటు విభిన్న రకాల రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్ అందిస్తారు. దీంతో పాటు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో పాలు, అలాగే మంగళ, గురు, శనివారాల్లో పౌష్టిక విలువలు గల రాగిజావను (రాగి మాల్ట్) మెనూలో భాగంగా అందజేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లను భారీగా పెంచేందుకు ‘బడిబాట’ కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేశామని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

హైదరాబాద్ జిల్లా పరిధిలో తొలి విడతగా ఎంపిక చేసిన 45 ప్రభుత్వ పాఠశాలల్లో ‘మన్నా ట్రస్ట్’ సహకారంతో ఈ అల్పాహార వితరణ ప్రక్రియను విజయవంతంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానా నాగేందర్, యశస్విని రెడ్డి, కలెక్టర్ ప్రియాంక అల, (DEO) యాదగిరి, మన్నా ట్రస్ట్ (CEO) లీనా జోసెఫ్ మరియు ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here