డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని పరామర్శించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్

AP Governor Abdul Nazeer Visits Dy CM Pawan Kalyan, Wishes Him For Speedy Recovery

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ఆయనను పరామర్శించారు. గురువారం హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన గవర్నర్, ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం వైద్యులు సూచించిన విధంగా విశ్రాంతి తీసుకోవాలని, చికిత్సకు సంబంధించిన అన్ని జాగ్రత్తలను పాటించాలని సూచించారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని మళ్లీ ప్రజా సేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.

లైబ్రరీని సందర్శించిన గవర్నర్

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన నివాసంలో ఏర్పాటు చేసుకున్న వ్యక్తిగత లైబ్రరీని గవర్నర్ సందర్శించారు. దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ రచయితలు, పరిశోధకులు, ప్రజా విధాన నిపుణులు రచించిన పుస్తకాలను ఆసక్తిగా పరిశీలించారు. పుస్తకాల సేకరణను అభినందిస్తూ, వివిధ అంశాలపై పవన్ కళ్యాణ్‌తో కొద్దిసేపు చర్చించారు. అనంతరం పవన్ కళ్యాణ్ అభ్యర్థన మేరకు ఒక పుస్తకంపై గవర్నర్ సంతకం చేసి శుభాకాంక్షలు తెలిపారు.

గవర్నర్‌కు పవన్ కృతజ్ఞతలు

తన ఆరోగ్యాన్ని తెలుసుకునేందుకు స్వయంగా నివాసానికి వచ్చిన గవర్నర్‌కు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ పరామర్శ తనకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిందని పేర్కొన్నట్లు సమాచారం.

విశ్రాంతిలో పవన్ కళ్యాణ్

ఇటీవల ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కళ్యాణ్ కుడి భుజానికి రొటేటర్ కఫ్ శస్త్రచికిత్స జరిగింది. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. క్రమంగా ఆరోగ్యం మెరుగుపడుతోందని, వైద్యుల పర్యవేక్షణలో రికవరీ కొనసాగుతోందని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here