ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్‌లో సరికొత్త సంచలనాలు నమోదవుతున్నాయి. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శన కనబరిచిన డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా, మాజీ విజేత ఇంగ్లండ్‌లు తమ ప్రత్యర్థులపై ఘనవిజయాలు సాధించి సగర్వంగా సెమీఫైనల్లోకి అడుగుపెట్టాయి. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్స్ పోరులో స్విట్జర్లాండ్‌ను అర్జెంటీనా మట్టికరిపించగా, సంచలనాల నార్వే జట్టుకు బ్రేక్ వేస్తూ ఇంగ్లండ్ సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ విజయాలతో బుధవారం రాత్రి జరగబోయే అత్యంత ప్రతిష్టాత్మకమైన మొదటి సెమీఫైనల్ పోరులో అర్జెంటీనా, ఇంగ్లండ్ జట్లు తలపడటానికి రంగం సిద్ధమైంది.
స్విస్ రక్షణను ఛేదించి సెమీస్‌కు దూసుకెళ్లిన మెస్సీ సేన
డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా జట్టు ఆదివారం ఉదయం స్విట్జర్లాండ్‌తో జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో 3-1 తేడాతో హోరాహోరీ విజయాన్ని అందుకుంది. బలహీన కేప్‌వెర్డె, ఈజిప్టు జట్లపై ఆఖరి నిమిషం వరకు పోరాడి గెలిచిన తరహాలోనే అర్జెంటీనా ఈ మ్యాచ్‌లోనూ పట్టుదల ప్రదర్శించింది. మ్యాచ్ ఆరంభమైన 10వ నిమిషంలోనే కెప్టెన్ లియోనెల్ మెస్సీ అందించిన అద్భుతమైన కార్నర్ పాస్‌ను అలెక్సిస్ అలిస్టర్ హెడర్‌తో గోల్‌గా మలిచి జట్టుకు 1-0తో ఆధిక్యాన్ని అందించాడు.
తాజా టోర్నీలో అలెక్సిస్‌కు ఇదే తొలి గోల్ కావడం విశేషం. అయితే 43వ నిమిషంలో స్విస్‌కు లభించిన ఫ్రీకిక్ అవకాశాన్ని రెమో ఫ్రూలర్ క్రాస్‌బార్ పైనుంచి పంపడంతో వృథా అయింది, ఆ వెంటనే స్విస్ ఫార్వర్డ్ బ్రిల్ ఎంబోలోకు ఎల్లో కార్డ్ లభించింది.
ద్వితీయార్ధంలో స్విస్ ఆటగాళ్లు పటిష్టమైన డిఫెన్స్‌తో మెస్సీని కట్టడి చేస్తూ అర్జెంటీనా గోల్‌పోస్ట్‌పై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో 67వ నిమిషంలో రోడ్రిగెజ్ అందించిన పాస్‌ను డాన్ ఎన్‌డోయే గోల్‌గా మల్చడంతో స్విస్ 1-1తో స్కోరును సమం చేసింది. కానీ 72వ నిమిషంలో అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ పరెడెస్ అడ్డుకోవడంతో కిందపడిన ఎంబోలోకు రెఫరీ రెండవ ఎల్లో కార్డ్ (రెడ్ కార్డ్) చూపించి మైదానం వీడాల్సిందిగా ఆదేశించాడు.
అయినప్పటికీ పది మందితోనే పోరాడిన స్విస్ మ్యాచ్‌ను అదనపు సమయం (ఎక్స్‌ట్రా టైమ్) వరకు తీసుకెళ్లింది. చివరకు 112వ నిమిషంలో జూలియన్ అల్వరెజ్ లాంగ్ రేంజ్ గోల్‌తో అర్జెంటీనాకు మళ్లీ ఆధిక్యం లభించగా, 120+1వ నిమిషంలో లౌటరో మార్టినెజ్ ఫినిషింగ్ టచ్‌తో మూడవ గోల్ సాధించి అర్జెంటీనాకు 3-1తో విజయాన్ని ఖాయం చేశాడు.
రెడ్‌కార్డ్ వివాదం మరియు రెఫరీపై మెస్సీ ఆగ్రహం
ఈ మ్యాచ్ ముగిసినా అర్జెంటీనాను వివాదాలు వీడటం లేదు. 72వ నిమిషంలో ఎంబోలోను పరెడెస్ కిందపడేసినందుకు పరెడె్‌సకు మొదట ఎల్లో కార్డ్ లభించినా, వీఏఆర్ (VAR) పరిశీలనలో పరెడెస్ తాకకముందే ఎంబోలో పడినట్లు తేలడంతో రెఫరీ ఎంబోలోకు ఎల్లో కార్డ్ ఇచ్చాడు. ఇది అతనికి రెండవ ఎల్లో కార్డ్ కావడంతో రెడ్ కార్డ్‌గా మారి మైదానం వీడాల్సి వచ్చింది.
ఈ నిర్ణయంపై స్విస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా, వీఏఆర్ నిర్ణయాలు అర్జెంటీనాకే అనుకూలంగా మారుతున్నాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు. మరోవైపు ప్రథమార్ధంలో స్విస్‌కు ఫ్రీకిక్ లభించినప్పుడు డిఫెన్సివ్ వాల్‌లో ఉన్న మెస్సీని దూరం జరగాలని రెఫరీ పిన్హిరో సూచించిన తీరుపై మెస్సీ తీవ్రంగా మండిపడ్డాడు. వేలెత్తి చూపుతూ “నాతో మర్యాదగా మాట్లాడు, నన్ను అగౌరవపరచవద్దు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో మెస్సీ ఒక్క గోల్ కూడా చేయలేకపోవడంతో అతని వరుస 10 మ్యాచ్‌ల గోల్స్ రికార్డుకు బ్రేక్ పడింది.
నార్వే సంచలనానికి బ్రేక్ వేసిన బెల్లింగ్‌హామ్ డబుల్ ధమాకా
ఆదివారం తెల్లవారుజామున జరిగిన మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2-1 తేడాతో నార్వేపై ఘన విజయం సాధించి సెమీస్‌లోకి ప్రవేశించింది. నార్వే స్టార్ స్ట్రయికర్ ఎర్లింగ్ హాలాండ్‌కు పూర్తి చెక్ పెడుతూ ఇంగ్లండ్ వ్యూహాత్మకంగా ఆడింది. ఇంగ్లండ్ స్టార్ మిడ్‌ఫీల్డర్ జూడ్ బెల్లింగ్‌హామ్ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ 45+2, 93వ నిమిషాల్లో రెండు గోల్స్ సాధించి జట్టును గెలిపించాడు. నార్వే తరఫున ఆండ్రియాస్ షెల్డెరప్ 36వ నిమిషంలో తొలి గోల్ అందించి జట్టుకు ఆధిక్యం ఇచ్చాడు. ఆ తర్వాత ఇంజ్యూరీ సమయంలో బెల్లింగ్‌హామ్ గోల్‌తో ప్రథమార్ధం 1-1తో సమమైంది.
సెకండాఫ్‌లో 56వ నిమిషంలో హాలాండ్ గోల్ చేసినా వీఏఆర్‌లో అది ఫౌల్‌గా తేలింది. అటు ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్ చేసిన గోల్‌ను కూడా రెఫరీ ఆఫ్‌సైడ్‌గా ప్రకటించారు. నిర్ణీత సమయానికి ఇరు జట్లు 1-1తో నిలవడంతో మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్‌కు దారితీసింది. 93వ నిమిషంలో బెల్లింగ్‌హామ్ డబుల్ గోల్‌తో ఇంగ్లండ్ ముందంజ వేసింది. తీవ్రమైన వేడిమి కారణంగా మైదానంలో చురుగ్గా కదల్లేకపోయిన హాలాండ్, 106వ నిమిషంలో అలసటతో మైదానాన్ని వీడడం నార్వే ఆశలపై నీళ్లు చల్లింది.
నార్వే కొంపముంచిన సోర్లోత్ తప్పిదం
నార్వే జట్టు ఓటమికి వారి స్ట్రయికర్ అలెగ్జాండర్ సోర్లోత్ చేసిన ఒక భారీ తప్పిదమే కారణమని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నార్వే 1-0తో ఆధిక్యంలో ఉన్నప్పుడు, 43వ నిమిషంలో రెండో గోల్ చేసే సువర్ణ అవకాశం లభించింది. ఆ సమయంలో డి-బాక్స్ ముందు ఇంగ్లండ్ డిఫెండర్ ఒక్కడే ఉండగా, సోర్లోత్ పక్కనే చాలా సులువుగా గోల్ చేసే స్థితిలో ఉన్న హాలాండ్‌కు పాస్ ఇవ్వకుండా స్వయంగా గోల్ చేయాలని తాత్సారం చేసి విఫలమయ్యాడు. టోర్నీలో ఒక్క గోల్ కూడా చేయని సోర్లోత్ స్వార్థపూరిత ఆటతీరు వల్లే నార్వే రెండో గోల్ చేజార్చుకుని భారీ మూల్యం చెల్లించుకుందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






































