ఈ నెల 20 నుంచి ఆగస్టు 13 వరకు జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు లోక్‌సభ సచివాలయం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. సభా భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు సభ్యుల వ్యక్తిగత గోప్యతను కాపాడే లక్ష్యంతో ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఎలాంటి రహస్య చిత్రీకరణలు, వీడియో రికార్డింగ్‌లు జరగకుండా ఉండేందుకు సాంకేతిక పరికరాలపై కఠిన ఆంక్షలు విధించింది.
స్మార్ట్ గ్యాడ్జెట్లపై పూర్తి నిషేధం
కొత్త మార్గదర్శకాల ప్రకారం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే సభ్యులు స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ గ్లాసెస్, పెన్ కెమెరాలు వంటి రికార్డింగ్ సామర్థ్యం ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను సభలోకి తీసుకురావడానికి అనుమతి ఉండదు. డిజిటల్ భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోక్‌సభ సచివాలయం తెలిపింది.
పార్లమెంట్ ప్రాంగణంలో నిరసనలకు నో
పార్లమెంట్ ఆవరణలో ధర్నాలు, రాజకీయ నిరసనలు, ప్లకార్డుల ప్రదర్శనపై కూడా పూర్తి నిషేధం విధించారు. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించే ఎలాంటి చర్యలనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. సభా గౌరవాన్ని కాపాడేందుకు అన్ని రాజకీయ పార్టీలు, సభ్యులు సహకరించాలని సూచించారు.
ఆయుధాలు, మతపరమైన కార్యక్రమాలకూ అనుమతి లేదు
పార్లమెంట్ ప్రాంగణంలో ఆయుధాలు తీసుకురావడం, ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు లేదా పూజలు నిర్వహించడం కూడా నిషేధితమేనని బులిటెన్‌లో పేర్కొన్నారు. భద్రత, శాంతిభద్రతలు, సభా మర్యాదలకు భంగం కలగకుండా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.
భద్రతే ప్రధాన లక్ష్యం
ఆధునిక సాంకేతిక పరికరాల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు పార్లమెంట్ సమావేశాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగేందుకు ఈ కొత్త మార్గదర్శకాలు రూపొందించినట్లు లోక్‌సభ సచివాలయం పేర్కొంది. సమావేశాలకు హాజరయ్యే ప్రతి సభ్యుడు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.




































