నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాల్లో భాగంగా, చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల పీఎంఏవై (PMAY గ్రామీణ్-2.0) ఇళ్ల నిర్మాణానికి వైభవంగా శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యాధునిక ‘3డీ కాంక్రీట్ ప్రింటింగ్’ పరిజ్ఞానంతో నిర్మించే పైలట్ ప్రాజెక్ట్‌కు భూమిపూజ నిర్వహించారు. ఈ నూతన సాంకేతికత ద్వారా కేవలం రూ. 5 లక్షల వ్యయంతో ఆరు నెలల స్వల్ప వ్యవధిలోనే పటిష్టమైన ఇళ్లను నిర్మించనున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలు, ఇళ్ల పట్టాలను అందజేసి, వారిని సత్కరించారు.
సాధారణ కోటా కింద రాష్ట్రానికి మొదట 75 వేల ఇళ్లు మాత్రమే లభించగా, చంద్రబాబు నాయుడు చేసిన ప్రత్యేక విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ సంఖ్యను ఏకంగా 3 లక్షలకు పెంచిందని శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ప్రస్తుతం చేపట్టిన 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిన వెంటనే మరో 3 లక్షలు, ఆ తదుపరి విడతలో మరో 3 లక్షలు చొప్పున మొత్తం 9 లక్షల ఇళ్లను మంజూరు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ఏపీలో చేపడుతున్న ఈ వినూత్న 3డీ గృహ నిర్మాణం దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తుందని ప్రశంసించారు. 2029 నాటికి రాష్ట్రంలో సొంతిల్లు లేని పేదే ఉండకూడదనే స్పష్టమైన లక్ష్యంతో పనిచేస్తున్నామని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమం ద్వారా పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడంతో పాటు, గ్రామాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మౌలిక వసతుల కల్పనకు బాటలు పడ్డాయి. స్వర్ణాంధ్ర ప్రదేశ్ నిర్మాణంలో భాగంగా అత్యాధునిక సాంకేతికతను పేదల సంక్షేమానికి జోడించి, గ్రామీణాభివృద్ధిలో సరికొత్త విప్లవానికి నాంది పలికారు.




































