ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌కి షాక్

Formula E Case ACB Seeks To Impound Ex Minister KTR and Three Others Passports Temporary Seize

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కి షాక్ తగిలింది. కేసు దర్యాప్తులో భాగంగా కేటీఆర్‌ సహా మరో ముగ్గురి పాస్‌పోర్టులను ఏసీబీ కోర్ట్ తాత్కాలికంగా సీజ్ చేసింది. ఈ మేరకు తాజాగా వీరి పాస్‌పోర్టులపై చర్యలు తీసుకోవాలని ఏసీబీ కోర్టు హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి లేఖ పంపింది.

కాగా, ఫార్ములా-ఈ రేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై తెలంగాణ ఏసీబీ దర్యాప్తు కొనసాగిస్తోంది. 2024 డిసెంబరులో నమోదైన కేసులో కేటీఆర్‌ను ఏ1గా, అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌ను ఏ2గా, మాజీ హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిని ఏ3గా, మాజీ స్పోర్ట్స్ కన్సల్టెంట్ గోవింద కిరణ్ మల్లేశ్వరరావును ఏ4గా పేర్కొన్నారు. ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌కు సంబంధించిన సంస్థ ప్రతినిధులు కూడా కేసులో నిందితులుగా ఉన్నారు.

రూ. 55 కోట్ల నిధుల కేటాయింపు – ఏసీబీ విచారణ

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పురపాలక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో, ఎలాంటి కేబినెట్ ఆమోదం లేదా ఆర్థిక శాఖ ముందస్తు అనుమతి లేకుండా ఫార్ములా-ఈ రేసు నిర్వాహకులైన ఫార్ములా-ఈ ఆపరేషన్స్ (FEO) సంస్థకు రూ. 54.88 కోట్లను హెచ్‌ఎమ్‌డీఏ ఖాతాల నుంచి చెల్లించారనేది ప్రధాన ఆరోపణ.

హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా-ఈ రేసు కోసం హెచ్‌ఎండీఏ నుంచి సుమారు రూ.55 కోట్ల చెల్లింపుల్లో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని ఏసీబీ ఆరోపిస్తోంది. ఈ కేసులో మార్చి 2026లో చార్జ్‌షీట్ దాఖలైంది. సెప్టెంబర్ 18న కేటీఆర్ నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను అక్టోబర్ 30కి కోర్టు వాయిదా వేసింది.

మరోవైపు, కేటీఆర్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం, పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగానే ఫార్ములా-ఈ రేసును నిర్వహించామని ఆయన చెబుతున్నారు. కేసు విషయంలో న్యాయవ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, కోర్టు పిలిచిన ప్రతిసారీ హాజరవుతానని ఇటీవల తెలిపారు.

ఈ వ్యవహారంపై పురపాలక శాఖ నమోదు చేసిన ఫిర్యాదు ఆధారంగా గవర్నర్ అనుమతితో ఏసీబీ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాయి. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్, నాటి ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌లను ఏసీబీ ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించి సమాచారం సేకరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here