ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బుధవారం నాడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకోనున్నారు. ముందుగా విశాఖలో శారదాపీఠం వార్షికోత్సవాల్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు. అనంతరం విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యోగుల జేఏసీ నాయకులను సీఎం కలవనున్నారు.
మరోవైపు ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయంపై విశాఖలో కార్మికులు ఆందోళనలు రోజురోజుకి పెరుగుతున్నాయి. టీడీపీ సహా పలు పార్టీలు నాయకులు కూడా కార్మికులకు మద్దతు తెలుపుతూ ఆందోళనలో పాల్గొంటున్నారు. ఇక ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 20న పాదయాత్ర చేయనున్నట్టు వైస్సార్సీపీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. కార్మికుల ఆందోళనకు మద్దతుగా జీవీఎంసీ నుంచి కూర్మన్నపాలెం ఉక్కు పరిశ్రమ గేటు వరకు 22 కి.మీ దూరం పాటుగా పాదయాత్ర చేయనున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ విశాఖ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. ఈ పర్యటనలో ఈ అంశంపై ఎలా స్పందిస్తారనే ఆసక్తి ప్రజల్లో నెలకొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ



































