తెలంగాణ రాష్ట్రంలో మొదటి కోవిడ్-19 (కరోనా కేసు) నమోదయినా సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని మహేంద్రహిల్స్ కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే 24 సంవత్సరాల యువకుడికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. ఫిబ్రవరి 19న దుబాయి నుంచి బెంగళూరుకు వచ్చిన ఆ యువకుడు అక్కడి నుంచి ఫిబ్రవరి 22న మహేంద్రహిల్స్‌లోని తన ఇంటికి చేరుకున్నాడు. అనంతరం 5 రోజులపాటు ఇంటివద్దనే గడిపాడు. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని కంటోన్మెంటు ప్రాంత అధికారులు అప్రమత్తమయ్యారు. అలాగే కరోనా వైరస్ కారణంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని మహేంద్రహిల్స్‌లో అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్టు యాజమాన్యాలు తెలియజేశాయి.
మరోవైపు కరోనా వైరస్ సోకినా యువకుడు ఫిబ్రవరి 22న మహేంద్రహిల్స్‌లోని తన ఇంటికి చేరుకున్న తర్వాత అయిదు రోజులపాటు ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరిని కలుసుకున్నాడు అనే పలు విషయాలపై సంబంధిత అధికారులు ఆరా తీస్తున్నారు. అతని కుటుంబ సభ్యులను ఇప్పటికే పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అలాగే కంటోన్మెంట్ పారిశుద్ధ్య విభాగంలోని సిబ్బంది ఆ యువకుడు ఇంటి పరిసరాలను, వీధులను శుభ్రం చేశారు. మహేంద్రహిల్స్ ప్రాంతంలో పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.
[subscribe]