తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణ రాజకీయాలలో అడుగు పెట్టడానికి కారణం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావేనని పేర్కొన్నారు టీ-కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఈ మేరకు ఆయన సోమవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తన పార్టీ పేరు నుంచి ‘టీ’ పదాన్ని తొలగించి తెలంగాణను అవమానించారని, తద్వారా తెలంగాణ వాదాన్ని సీఎం కేసీఆర్ చంపేశారని మండిపడ్డారు. రాజకీయంగా బ్రతుకునిచ్చిన చెట్టునే కేసీఆర్ నరికేశారని, ఎప్పుడైతే ఆయన పార్టీ పేరు నుంచి తెలంగాణ తొలగించారో, అప్పుడే కేసీఆర్ బలం పోయిందని వ్యాఖ్యానించారు.
ఇక సీఎం కేసీఆర్ మనసులో ఎక్కడో ఓ మూలన సమైక్య భావన ఉందని తమకు అనుమానాలు కలుగుతున్నాయని, అలాగే తెలంగాణ పట్ల ఆయన చిత్తశుద్ధిని శంకించే పరిస్థితి తెచ్చుకున్నారని జగ్గారెడ్డి అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సైలెంట్‌గా ఉన్న చంద్రబాబుకు మళ్ళీ తెలంగాణలో అడుగు పెట్టేలా సీఎం కేసీఆరే అవకాశం ఇచ్చారని, బీఆర్ఎస్ పార్టీ రూపంలో ఆయన ఏపీకి వెళుతున్నారు కాబట్టే, చంద్రబాబు తెలంగాణలో అడుగు పెడుతున్నారని తెలిపారు. అయితే సీఎం కేసీఆర్ ఏపీలో రాజకీయాలను ప్రభావితం చేయలేరని, కానీ చంద్రబాబు తెలంగాణలో రాజకీయాలను ప్రభావితం చేయగలరని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు, చంద్రబాబు రాకతో ఇకపై తెలంగాణాలో రాజకీయం మారనుందని, పొత్తులపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని, ఎన్నికల నాటికి భావసారూప్యత ఉన్న పార్టీలు కలిసి అవకాశం ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇటీవల టీటీడీపీ ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో జరిగిన ‘విజయ శంఖారావం’ సభకు జనం భారీగా హాజరైన నేపథ్యంలో.. జగ్గారెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE