ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో భారీ పరిశ్రమ స్థాపన దిశగా కసరత్తు మొదలైంది. స్విడ్జర్లాండ్‌కు చెందిన ‘ఐఎంఆర్ ఏజీ’ కంపెనీ కడప జిల్లాలోని జమ్మలమడుగులో భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు తగిన ప్రతిపాదనలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించింది. ఈ మేరకు ఆ కంపెనీ ప్రతినిధులు మార్చ్ 5, గురువారం నాడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో సమావేశమై స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై చర్చలు జరిపారు. 10 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని, సుమారు రూ.12 వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టే అవకాశముందని తెలిపినట్లుగా సమాచారం. ఈ సందర్భంగా ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, కొలంబియా, ఇటలీ, ఉక్రెయిన్, భారత్ సహా పలు దేశాల్లో బొగ్గు, ఇనుప ఖనిజం, బంగారం గనుల తవ్వకాలతోపాటు విద్యుత్, ఉక్కు కర్మారాగాలను తాము ఇప్పటికే నిర్వహిస్తున్నట్లు ఐఎంఆర్ కంపెనీ ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్ కు వివరించారు. రాబోయే రోజుల్లో కడప జిల్లా స్టీల్‌సిటీగా రూపాంతరం చెందే అవకాశాలున్నాయని, యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరుగుతుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నట్టు తెలుస్తుంది.
స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామని సీఎం వైఎస్ జగన్ ఎంఆర్‌ఐ ప్రతినిధులకు తెలిపారు. కడప జిల్లాలో ఐఎంఆర్ స్టీల్‌ప్లాంట్ పెడితే అక్కడ మంచి పారిశ్రామిక వాతావరణం ఏర్పడుతుందని సీఎం అన్నారు. అలాగే నీరు, కరెంటు, మౌలిక సదుపాయాలు ఇలా స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఏ సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం చెప్పారు. కృష్ణపట్నం పోర్టు, అక్కడి నుంచి రైల్వే మార్గం, జాతీయ రహదారులతోకూడిన మంచి రవాణా సదుపాయం కూడా ఉందని ప్రతినిధులకు తెలిపారు. ఐఎంఆర్ కంపెనీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
[subscribe]