విజయనగరం జిల్లాలో దేవాదాయ శాఖ పరిధిలో నడుస్తున్న ప్రఖ్యాత మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా సంచయత గజపతి రాజును రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా ట్రస్ట్‌కు చైర్మన్ గా వ్యవహరిస్తున్న టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ను ఆ పదవి నుంచి తొలగించిన ప్రభుత్వం, ఆయన సోదరుడు ఆనంద గజపతి రాజు రెండో కుమార్తె సంచయతను చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్‌పర్సన్‌గా మార్చ్ 4, బుధవారం నాడు సంచయత ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై శనివారం నాడు విజయనగరంలో అశోక్‌గజపతిరాజు మీడియాతో మాట్లాడారు. మాన్సాస్ ట్రస్ట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు సరిగాలేదని అన్నారు.
మాన్సాస్ ట్రస్ట్ కింద సింహాచలం దేవస్థానం పరిధిలో 108 ఆలయాలు, వేల ఎకరాల భూములు ఉన్నాయని, దేవస్థానం భూములపై కొందరు కన్నేశారని ఆయన ఆరోపించారు. దాతలు ఇచ్చిన భూములు ఆలయానికే చెందుతాయని అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు. ట్రస్టుకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, అయితే ఇలాంటి ప్రముఖ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా వేరే మతస్తులను నియమిస్తే సమస్యలు ఎదురవుతాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో భవిష్యత్ తరాలవారికి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. చైర్మన్ గా నియమించబడ్డ సంచయత ఆధార్‌కార్డు ఒకసారి పరిశీలిస్తే ఆమె ఎక్కడ నివసిస్తున్నారో అందరికీ తెలుస్తుందని పేర్కొన్నారు. చైర్మన్ గా తొలగించే విషయంలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే నిర్ణయం తీసుకుని, రాత్రికి రాత్రే జీవో ఇచ్చారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల సహకారంతో న్యాయ పోరాటం చేస్తానని అశోక్‌గజపతిరాజు పేర్కొన్నారు.
[subscribe]