కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయిల్ ట్యాంకర్‌లోకి దిగిన ఏడుగురు కార్మికులు దుర్మరణం చెందారు. జిల్లాలోని పెద్దాపురం మండలం జి.రాగంపేటలో అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం ఫ్యాక్టరీలోని ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఆయిల్ ఫ్యాక్టరీ వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అలాగే ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ ఫ్యాక్టరీ ఏడాది క్రితమే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అలాగే మృతి చెందిన కార్మికులు 15 రోజుల క్రితమే పనిలో చేరినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే.. సాధారణంగా పరిశ్రమలోని ఆయిల్ ట్యాంకర్‌ను కార్మికులు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటారు. దీనిలో భాగంగా గత రెండు రోజులుగా ట్యాంకర్‌లోని ఆయిల్ మొత్తం బయటకు తీస్తున్నారు. ఈ క్రమంలో నేడు ట్యాంకర్‌ను శుభ్రం చేయడానికి ఏడుగురు కార్మికులు అందులో దిగారు. ఈ సందర్భంగా ఒక్కసారిగా ఘాటైన వాయువులు వెలువడటంతో కార్మికులు భీతిల్లారు. దీంతో వెంటనే ట్యాంకర్ నుంచి బయటకు వచ్చేందుకు కార్మికులు ప్రయత్నించారు. అయితే అప్పటికే విష వాయువులు పీల్చడంతో ఊపిరాడక ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. కాగా మృతులను పాడేరుకు చెందిన కుర్రా రామారావు, వెచ్చంగి కృష్ణ, వెచ్చంగి నరసింహ, వెచ్చంగి సాగర్, కురతాడు అంజిబాబు మరియు పెద్దాపురం మండలం పులిమేరు గ్రామానికి చెందిన కట్టమూరి జగదీశ్, ప్రసాద్‌లుగా గుర్తించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE